అసెంబ్లీని కూడా బ్లీచింగ్ పౌడర్ తో నింపేస్తారా
posted on Jun 9, 2020 @ 1:24PM
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుండి ప్రారంభం కావచ్చని వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు అసెంబ్లీ లో పూర్తీ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టని కారణంగా ఇప్పుడు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ బడ్జెట్ సెషన్ లో ఏడాది పాలనా వైఫల్యాల పైన సభలో జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ నిలదీస్తుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. గడచిన ఏడాది కాలంలో 80,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసింది చెప్పాలని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఏడాది లో మొదటి పది నెలలు జగోనాతో తరువాత రెండు నెలలు కరోనా తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన అన్నారు. 151 సీట్లు సాధించామన్న జగన్ కరోనా విషయంలో విఫలమయ్యారని అయన విమర్శించారు. రైతు కూలీలు, వలస కార్మికులు, వివిధ వృత్తుల వారికీ కేంద్రం ఇచ్చిన 1000 రూపాయల సాయానికి ఇతర రాష్ట్రాలు మరి కొంత జత చేసి ప్రజలకు పంచితే.. ఇక్కడ మాత్రం దానిలో కోత పెట్టి కేవలం 500 రూపాయలు ఇచ్చి అది కూడా తమ జేబుల నుండి ఇచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చారని విమర్శించారు.
ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకోకుండా సాండ్, వైన్, ల్యాండ్ స్కామ్ లతో వేల కోట్లను వెనకేసుకుంటున్నారని రామానాయుడు విమర్శించారు. దళితుల పై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువయ్యాయని ఈ సందర్బంగా డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, మాజీ ఎంపీ హర్ష కుమార్, ప్రొఫెసర్ ప్రేమానందం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును అయన ఎండగట్టారు. కరోనాను అడ్డుపెట్టుకుని తూతూమంత్రం గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందుగా అసెంబ్లీ నిర్వహణ విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని అయన ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కు విరుగుడు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అన్నారని ఇపుడు శాసనసభను బ్లీచింగ్ పౌడర్ తో ముంచేత్తుతారా అని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాక్షాత్తు కేంద్రం ఆదేశాలను, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నారని జగన్ ప్రభుత్వాన్ని నిమ్మల విమర్శించారు.