జగన్ సర్కారుపై నిమ్మగడ్డ మరో పోరు.. హైకోర్టులో పిటిషన్
posted on Oct 21, 2020 @ 2:55PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదని, ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని అన్నారు. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుని నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను చేర్చారు.
కాగా, జగన్ సర్కార్ కి నిమ్మగడ్డకి నడుమ పెద్ద యుద్ధమే జరిగిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేయగా.. జగన్ సర్కార్ ఆయనపై విమర్శలు చేసింది. అంతేకాదు, ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏకంగా ఆయనను పదవి నుంచి తొలగించింది. అయితే, నిమ్మగడ్డ న్యాయపోరాటం చేసి గెలిచి మళ్ళీ పదవి చేపట్టారు. అయితే, ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడంతో.. వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిని రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తూ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తే.. ఆయనపై విమర్శలు చేసి, ఆయనను పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు తీరా కరోనా అదుపులోకి వచ్చాక ఎన్నికలు నిర్వహిస్తామంటే సహకరించకపోవడం ఏంటని.. ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.