నైట్ షిఫ్ట్ వల్ల బ్రెస్ట్ కాన్సర్

 

ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడి ఉండేది.  కాలం మారింది ఆ నానుడి కూడా పాతబడిపోయింది. ఇప్పుడు అన్ని రంగాల్లో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఎందులోనూ మేము తక్కువ కాము అన్నట్టు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికన్ టైమింగ్స్ కి అనుగుణంగా రాత్రిళ్ళు కూడా పనిచెయ్యాల్సి వస్తే దానికి కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా ముందుకు దూసుకేళ్తున్నారు. జీతాలు ఎక్కువ విశ్రాంతి తక్కువ అయిపోతోంది.

 

ఇలాంటి నైట్ షిఫ్ట్ లు అమ్మాయిల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అని అడిగితే చెడు ప్రభావమే అంటున్నారు పరిశోధకులు. రాత్రిళ్ళు డ్యూటి చేసే ఆడవారిలో బ్రెస్ట్ కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందిట. శరీరంలో మెలటోనిన్‌, హార్మోన్లపై ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మెలటోనిన్‌ రక్తంలో ఈస్ట్రోజన్‌ను తగ్గిస్తుంది, క్యాన్సర్‌ కణాల పెరుగదలనూ నిరోధిస్తుంది. మామూలుగా మన మెదడు మెలటోనిన్‌ను ఎక్కువగా మధ్యరాత్రి వేళల్లో వాతావరణం చీకటిగా ఉన్నప్పుడే ఉత్పత్తి చేస్తుంది. అలాంటి  సమయంలో నిద్రపోకుండా సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్‌ విడుదలను ఆపేస్తుంది. దీనికారణంగా ఆరోగ్యం దెబ్బతిని రొమ్ము క్యాన్సర్‌ ఒక్కటే కాకుండా, పలురకాల అనారోగ్య సమస్యల ముప్పు పొంచి ఉంటుందన్నారు.

 

 

ఈ కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఈ సమస్యని నివారించుకోవాలంటే శరీరానికి  వ్యాయామం ఎంతైనా అవసరం. అలాగే నీళ్ళు ఎక్కువగా  తాగుతూ ఉండాలి. వెల్లుల్లి అన్ని వంటకాలలో తగిన విధంగా వాడాలి. దానిమ్మ పండుని ఎక్కువగా తినాలి. మాములు టీ బదులు గ్రీన్ టీ అలవాటుచేసుకోవటం మంచిది. రాత్రిపూట భోజనం బరువైనది కాకుండా చూసుకోవాలి. తేలికగా అరిగె పదార్థాలు తింటే సమస్య మన దగ్గరకి రాకుండా ఉంటుంది.

 

      ...కళ్యాణి