తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వార్
posted on Jun 22, 2023 @ 4:18PM
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్తవార్ మొదలైంది. కర్నాటక ఫలితాల తరువాత నుంచీ పార్టీలో మొదలైన జోష్ పార్టీ నేతలంతా విభేదాలను విస్మరించి ఐక్యంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం కలిసి పని చేస్తున్నారన్న వాతావరణం కనిపించింది.
దీనికి తోడు కాంగ్రెస్ హై కమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పార్టీలో నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు నడుం బిగించడంతో ఒక్క సారిగా తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటి వరకూ ఎన్నడూ కనిపించని సానుకూలత కనిపించింది. అన్ని వర్గాలూ ఒక్కటై పార్టీ విజయం కోసం పని చేస్తున్నారన్న వాతావరణం ఏర్పడింది. సహజంగానే ఈ పరిస్థితి ఇతర పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి వాదులను ఆకర్షించింది. దీంతో పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున వస్తాయన్న వాతావరణం ఏర్పడింది.
ఇందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమ మొగ్గు కాంగ్రెస్ వైపే అన్న సంకేతాలు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ముగ్గురూ కూడా నేతల చేరికల విషయంలో తన హస్తం ఉంది అనిపించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. చేరికల క్రెడిట్ కొట్టేసి పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకోవాలని తాపత్రేయ పడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారకుడైన తన సోదరుడిని మళ్లీ కాంగ్రెస్ గూటికి చేర్చి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావడం ద్వారా తన సత్తా చాటాలని యత్నిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సోదరుడు ఇలా సైగ చేస్తే అలా వచ్చి హస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ గూటికి చేరడంలో రేవంత్ కంటే తన కృషే ఎక్కువ అని చాటుకునేందుకు వెంకటరెడ్డి యత్నిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులే చెబుతున్నాయి. మరో వైపు ఇక పొంగులేటి సొంత జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనతో తనకు ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని తరచూ సంప్రదింపులు జరపడం ద్వారా ఆ చేరిక క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు.
వడదెబ్బ తగిలి తాత్కాలిక క్యాంపు సైట్ లో విశ్రాంతి తీసుకుంటున్న భట్టిని పొంగులేటి కలవడాన్ని కూడా ఆయన కాంగ్రెస్ చేరిక వెనుక తన క్రెడిట్ ఉందని భట్టి చాటుకునే యత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఇప్పుడు కనిపిస్తున్న సానుకూల వాతావరణం నివురుగప్పిన నిప్పేనా, తుపాను ముందటి ప్రశాంతతేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
పైకి కలిసే పని చేస్తున్నట్లుగా ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా కనిపిస్తున్నా... లోలోన మాత్రం ఎవరికి వారు తమ ఆధిపత్యం నిరూపించుకునేందుకు, చాటుకునేందుకు తెరచాటు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వార్ ముమ్మరంగా జరుగుతోంది. ముగ్గురు అగ్రనేతల మధ్య చేరికల క్రెడిట్ కోసం సాగుతున్నయుద్ధంలో ఎవరు పై చేయి సాధిస్తారన్న ఆసక్తి ఆ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ, పరిశీలకుల్లోనూ కూడా వ్యక్తమౌతోంది.