కొత్త సచివాలయం.. వ్యయం తడిసి మోపెడు
posted on Apr 29, 2023 @ 3:08PM
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం (సెక్రటేరియట్) ప్రారంభానికి సిద్దమైంది. ఆదివారం ఏప్రిల్ 30 న ముఖ్యుమంత్రి కేసీఆర్.. కొత్తసచివాలయంలో కాలు పెడతారు. నిజానికి కొత్త సెక్రటేరియట్ అవసరం లేకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకనో ఉన్న ఉమ్మడి రాష్ట్ర సెక్రటేరియట్ ను కూల్చి కొత్త సెక్రటేరియట్ నిర్మాణా నికి మూడేళ్ళ క్రితం శంఖు స్థాపన చేశారు. ఒకే సంవత్సరంలో సెక్రటేరియట్ నిర్మాణంపూర్తవుతుందని భావించినా, నిర్మాణం పూర్తి కావడానికి మూడేళ్ళు పట్టింది. నిజానికి ఇప్పటికి కూడా ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. అంతే కాదు కొత్త సెక్రటేరియట్ పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉందని అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు.
అదలా ఉంటే... సెక్రటేరియట్ నిర్మాణ ఖర్చు తడసి మోపెడంత అయింది. మూడేళ్ళ క్రితం 2020లో రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులు ఎందుకనో అనుకున్నంత వేగం సాగలేదు. నిర్మాణ పనులు ఆలస్యం అయిన కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతూ వచ్చింది. ఏడాదిలో అనుకున్న నిర్మాణం పూర్తి కావడానికి మూడేళ్ళు పడితే, నిర్మాణ వ్యయం ఏకంగా నాలుగు రెట్లు పెరిగి రూ.1600 కోట్లకు చేరింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి 2020లో బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత టెండర్ల టైమ్ లో ఈ మొత్తాన్ని రూ.494 కోట్లకు పెంచారు. దీనికంటే 4 శాతం ఎక్కువకు షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ రూ.514 కోట్లకు కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. మళ్లీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక ఫ్లోర్ పెరిగిందని, ఇంకో లక్ష చదరపు అడుగులకు రూ.219 కోట్లు ఖర్చు అవుతుందంటూ నిర్మాణ వ్యయాన్ని రూ.619 కోట్లకు పెంచి బడ్జెట్ కేటాయింపులు చేశారు. అనంతరం ధరలు పెరిగాయని, కరోనా పేరుతో నిర్మాణ ఖర్చును రూ.800 కోట్లకు పెంచారు.
పనులు ఆలస్యం కావడంతో అది కాస్తా రూ.1,200 కోట్లకు చేరింది. ఇప్పుడు పనులన్నీ పూర్తయ్యే నాటికి సెక్రటేరియెట్ నిర్మాణ ఖర్చు మొ త్తం రూ.1,600 కోట్లకు చేరిందని అధికార వర్గాల సమాచారం.
అయితే ఇంత చేసినా కొత్త సెక్రటేరియెట్ బయట నుంచి రాజభవనంలా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం అంత గొప్పగా లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సీఎంఓ ఉండే ఆరో ఫ్లోర్ మాత్రమే అద్భుతంగా తీర్చిదిద్దారని, అక్కడే అన్ని హైటెక్ హంగులు కల్పించారని అంటున్నారు. మంత్రులు, స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారుల ఆఫీసుల్లో వర్క్ స్పేస్ పెద్దగా లేదని చెబుతున్నారు. వర్క్ స్పేస్ సరిగా లేకపోతే ఇన్ని వందల కోట్లు పెట్టి పెద్ద బిల్డింగ్ కట్టి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు.
సెక్రటేరియేట్లోని చివరి అంతస్తు (ఆరో ఫ్లోర్)లో సీఎం, సీఎంఓ మొత్తం కొలువు దీరనుంది. ఈ ఫ్లోర్ మొత్తం కేసీఆర్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. విశాలమైన ఆఫీసులు ఇవ్వడంతో పాటు కంప్లీట్ బుల్లెట్ ప్రూఫ్ ఫ్లోర్ గా మార్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చైర్స్, సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్ వంటివన్నీ కలిపితే రూ.10 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇక్కడ సీఎం కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. కాగా సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్రటేరియెట్ చుట్టూ మూడంచెల భద్రత, 300 సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు.