తెలంగాణ ఠీవీకి దర్పణం.. కొత్త సచివాలయం
posted on Apr 26, 2023 @ 3:37PM
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబౌతోంది. ఇప్పటికే కొత్త సచివాలయంలోకి శాఖల తరలింపు షురూ అయ్యింది. బుధవారం బిఆర్కె భవన్ నుంచి ఆయా శాఖల ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ఆరంభమైంది. అంతుకుముందు సిఎస్ శాంతికుమారి కొత్త సచివాయానికి వెళ్లి పరిస్థితిని సవిూక్షించారు. ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాలను పరిశీలించారు.
సచివాలయం ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల విూదుగా ప్రారంభం కానున్నది. ఆ రోజు నుంచే కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖలు తమకు కేటాయించిన గదులకు సామగ్రిని బుధవారం నుంచి శుక్రవారం వరకు తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సచివాలయంలోని ఒక్కో అంతస్తులో మూడు శాఖల కార్యాలయాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఎపిలో విసిరేసినట్లుగా ఉన్న సచివాలయాన్ని అదే ప్రాంతంలో కొత్తగా అధునాతనంగా నిర్మించారు.
హుస్సేన్ సాగర్ తీరాన ధవళకాంతులతో తెలంగాణ ఠీవికి దర్పణంలా ఈ కొత్త సచివాలయం గోచరిస్తోంది. హిందూ, దక్కనీ, కాకతీయ శైలుల మేళవింపుతో చేపట్టిన నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి.
సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దంపట్టే కళాకృతులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం లో లేని విధంగా ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక నిర్మాణ పద్ధతులతో భవనాన్ని నిర్మించామని వివరించారు. అత్యాధునిక హంగులతో కూడిన భవన సముదాయాన్ని నాలుగేళ్లలో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన రెండు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపును ఏర్పాటు చేశారు. భవనంపై పడిన ఒక్క నీటి చుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని మార్గదర్శిలా తీర్చిదిద్దారు.