కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి!
posted on Jun 21, 2023 @ 10:19AM
ఎన్నికల సీజన్ లో పార్టీ ఫిరాయింపులు ఎంత కామనో ..కొత్త పార్టీలు పుట్టుకురావడం కూడా అంతే కామన్. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ ఇప్పడు అదే జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్’లో ప్రముఖ వ్యాపార వేత్త, గతంలో జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి..ఓడిన, రామచంద్ర యాదవ్’ అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ, ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే విజయవాడలో గత ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జూలై 23న గుంటూరు- విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ‘ప్రజా సింహగర్జన పార్టీ’ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దోపిడీ పరిపాలన నడుస్తోందని రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు. భూములు, మైనింగ్, ఇసుక పేరుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రూ. వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక సాగు నీటి ప్రాజెక్టుల్లో రూ.30 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆక్షేపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
చివరికి, రాష్ట్రానికి రాజధాని కూడా కట్టలేకపోయారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు చెప్పి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని పరిస్థితి కల్పించారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటూ అణచి వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని అధికారంలోకి తీసుకురావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే రాజకీయ మార్పు కావాల్సిందే అని స్పష్టం చేశారు. రాబోయే కొత్త పార్టీ రాష్ట్రంలో నవశకాన్ని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా జరిగి.. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పలు పనులు చేస్తున్నారు.
వైసీపీ ముఖ్య నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు తనపై దాడులు చేస్తున్నారంటూ.. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి తన ఇబ్బందులు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటించడం విశేషం.
అదలా ఉంటే, ప్రజాయుద్ధనౌక గద్దర్, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల కోసం గజ్జెకట్టేందుకు సిద్దమయ్యారు. గత కొంత కాలంగా, ఎన్నికల రాజకీయలపై ఆసక్తి కనబరుస్తున్న ప్రజా గాయకుడు గద్దర్ చివరకు ఏదో పార్టీలో చేరడం కాకుండా తెలంగాణలో సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ మొదలు వైఎస్సార్ టీపీ వరకు అనేక పార్టీల వేదికల మీద కనిపించి, వినిపించిన గద్దర్ చివరకు సొంత పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు.
అంతే కాదు ఆ దిశగా ఆయన చకచకా అడుగులు వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న గద్దర్ బుధవారం(జూన్ 21) గద్దర్ ప్రజా పార్టీ పేరుతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, ప్రధాన కార్యదర్శిగా జి.నగేశ్ కలిసి దరఖాస్తును ఎన్నికల అధికారులకు సమర్పించనున్నారు. రాజకీయ పార్టీగా దరఖాస్తు చేసుకోడానికి ముందు జరగాల్సిన ప్రక్రియ, లాంఛనాలన్నీ పూర్తయినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పార్టీ పేరును సూచిస్తూ సమర్పించే దరఖాస్తుతో పాటే నియమ-నిబంధనావళిని సైతం జతచేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది గద్దర్ లక్ష్యంగా పేర్కొంటున్నారు.
గత కొద్ది రోజులుగా గద్దర్ రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. మరోవంక స్వరాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, నిరుద్యోగ సమస్య, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల తీరు, ధరణి పోర్టల్ వల్ల ప్రజలు పడుతున్న బాధలను, పాటలుగా మలచి బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేస్తున్నారు
ఈ క్రమంలోనే గద్దర్.. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. నిజానికి, గద్దర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు కేఏ పాల్ ను కూడా కలిశారు. ఆయన సమక్షంలోనే .. తన ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్ ను అభ్యర్థిగా ప్రకటించారు పాల్. తర్వాత గద్దర్ సైలెంట్ అయ్యారు. ఇటీవల కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే వైఎస్సార్ టీపీ వేదిక మీద కనిపించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అభినందించారు.
ఆమె కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అలాగే తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు కొందండ రామ్ తోనూ మంతనాలు సాగించారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో ఆ ప్రభావం ఎంత ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ కోసమే గద్దర్ రాజకీయ గజ్జె కడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.