Read more!

నవరత్నాలు ప్లస్ V/s ఆరు గ్యారెంటీలు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్  రాష్ట్రం చుట్టి వ‌చ్చారు క‌దా..., విష‌యం అర్థం అయి వుంటుంది. అందుకే  సి.ఎం.జగన్, ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నికలు జరగక ముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్క‌డ రెండు విష‌యాలు మ‌నం మాట్లాడుకుంటే 
1. నామినేష‌న్ల ప‌ర్వం చాలా పేల‌వంగా, జ‌న‌మే లేకుండా వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. జ‌నాన్ని త‌ర‌లించాలంటే డ‌బ్బు పెట్టాలి. ఎలాగూ ఓడిపోతాం క‌దా అని అనుకున్నారేమో కానీ, నామినేష‌న్ల ఘ‌ట్టంలో వైసీపీ అభ్య‌ర్థులు జ‌నాన్ని త‌ర‌లించ‌లేక‌పోయారు. 
2. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని ప్ర‌చారం జ‌రిగిన మేనిఫెస్టో.... అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్ర‌క‌టించేశారు. 
పాత‌ ఎన్నికల మేనిపెస్టోనే మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే.  వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి మార్పు క‌నిపించ‌లేదు. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు.  

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసి ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు.  క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు స్ప‌ష్టంగా కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే, విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశం ఇది. అయినా, మేనిఫెస్టోలో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని మ‌ళ్ళీ పాత పాటే పాడారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చ జ‌రుగుతోంది. వీటితో పాటు  జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి.. 10 గ్యారెంటీ హామీలను ఇస్తామంటోంది.  వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి, ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ‌త నెల‌కొంది.
- ఎం.కె.ఫ‌జ‌ల్‌