కేసీఆర్‌ని కలిశారు... చిక్కుల పాలయ్యారు!
posted on Aug 27, 2022 @ 11:24PM
కొందరి కలయిక అద్భుతం అంటారు, మరికొందరి కలయిక ఎంతో మేలయినదంటారు, కానీ కేసీఆర్‌తో భేటీ అయినవారంతా రాజకీయాల్లో ఊహించని షాక్‌లు తింటూండటం గమనార్హం. ఇది యాదృచ్ఛికమా, టీఆర్ ఎస్ అధినేత ఐరన్‌లెగ్ మహత్యమా అన్నది పక్కన పెడితే... కేసీఆర్ కు రాజకీయంగా సన్నిహితం అవ్వడానికి ప్రయత్నించిన వారంతా ఏదో విధంగా చిక్కులలో పడుతున్నారన్నది మాత్రం వాస్తవం.
మోదీ ప్రభు త్వాన్ని గద్దె దించడానికి కేసీఆర్ తాపత్రయం, దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్ పడడానికి మాత్రం ఆయన వెనుక అడుగు వేయడానికి లేదా ఆయనతో కలిసి నడవడానికి ముందడుగువేసిన వారంతా ఇబ్బందులలో పడుతుండటంతో జాతీయ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చేసిన చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందాన సాగుతున్నాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు కేసిఆర్ బీజేపీ మీద దూకుడుగానే ముందుకు వెళ్ళారు. కేసిఆర్ వెళ్లిన ప్రతి రాష్ట్రం లో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో అదరగొట్టారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ప్రచారంతో ఊదరగొట్టారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అంచనాతో కేసిఆర్ కేంద్రం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక తాను కలిసిన ప్రాంతీయ పార్టీల అధినేతలతో కూడా బీజేపీ పతనం అవుతుందన్న విషయాన్ని ప్రస్తావించి తనతో కలిసి రావాల్సిందిగా కోరారు. రాజకీయ వ్యూహకర్త పీకే సలహాలతో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ బీజేపీ ఓడుతుందని కేసిఆర్ వేసిన అంచనాలు తప్పాయి.
.సామాజిక న్యాయం, సమానత్వా న్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకు వచ్చేందు కు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో పార్టీల నేతలు, పౌర సమాజ సభ్య లు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని భావించారు కేసీఆర్. ఈ లక్ష్యాలను సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పీపుల్స్ ఫ్రంట్ అని సీఎం కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీ ఆర్ ఎన్డీయేతర నాయకులను వరసగా కలిశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతోనూ మంతనాలు జరిపారు. కేసీఆర్. అటు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ముచ్చటపడ్డారు.
దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారని, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరా టం కొనసాగించాలని.. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కేసీఆర్‌కు ఉద్ధవ్ థాక్రే మద్దతు ప్రకటించారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు. కానీ చిత్రమేమంటే, కేసీఆర్‌ను కలిసి చర్చించిన వేళావిశేషమేమోగాని, ఉద్ధవ్ థాక్రే ఏకంగా సీఎం పదవిని కోల్పోయి, అధికార నివా సం నుంచి స్వంత నివాసాన్ని చేరుకున్నారు. ఊహించనివిధంగా బీజేపీ పావులు వేగంగా కదిపి థాక్రేకు షాక్ ఇచ్చింది. శివసేన పార్టీలోనే అసమ్మతి నాయకులను ప్రోత్సహించి థాక్రేకు ఊపిరాడనీయకుండా చేసింది బీజేపీ. తనకు పదవుల మీద ఎన్నడూ ఆసక్తి లేదని, ప్రజలు మా పార్టీని నమ్ముతున్నారని, వారి అభిప్రాయాన్ని అంగీకరిస్తానని నిండు సభలో ప్రకటించి మరీ గద్దె దిగారు.
అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కేసీఆర్ భేటీల తరువాతే గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనపై అనర్హత వేటు వేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కేసీఆర్ తో భేటీ తరువాతే చిక్కుల్లో పడ్డారు. ఆమె కేబినెట్ లో మంత్రి అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. అరెస్టయ్యారు. కనీసం ఆయనకు మద్దతుగా మమత చిన్న ప్రకటన కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఇక ఆప్ విషయానికి వస్తే కేసీఆర్ తో భేటీల తరువాతే ఆ రాష్ట్రంలో లిక్కర్ స్కాం వెలుగులోనికి వచ్చి ఆ కుంభకోణం కేసులో ఏకంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఏ వన్ గా ఈడీ కేసు నమోదు చేసింది. కారణాలేమైతేనేం కేసీఆర్ తో రాజకీయంగా కలిసి నడిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వివిధ పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరుగా చిక్కుల్లో పడటంతో ఆయనతో కలిసేందుకు, భేటీ అయ్యేందుకూ జాతీయ స్థాయి రాజకీయాలపై చర్చించేందుకూ కూడా పార్టీలనాయకులు భయపడుతున్నారు. రాజకీయ నేతలలో ఆయనది ఐరన్ లెగ్ అన్నముద్రపడిందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.