తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవం
posted on Sep 17, 2025 @ 1:35PM
తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని బీఆర్ఎస్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరారామావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టిన సెప్టెంబర్ 17ను కొందరు విమోచనమని, మరి కొందరు విలీనం అని అంటున్నారని, అయితే ఎవరెలా అన్నా వేలాది మంది రాజరిక వ్యవస్థపై పోరాడి ప్రాణాలర్పించారన్నది వాస్తవమన్నారు. నాటి పోరాట యోధులందరికీ బీఆర్ఎస్ తరఫున శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. పోరుగడ్డ తెలంగాణ.. నాటి సాయుధ రైతాంగ పోరాటం నుంచి, 1969 తెలంగాణ ఉద్యమం,ఆ తర్వాత జరిగిన కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమాలను చూసిందన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందన్నారు. రైతన్నలు యూరియా కోసం రోడ్లపైకి వస్తుంటే వారి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టడం మానేసి ఈ ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుందన్నారు. ఆనాటి పోరాట యోధుల త్యాగాల సాక్షిగా తెలంగాణ బిడ్డలు మరోసారి పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు.