జూ.యన్టీఆర్ మామ వైకాపాలోకి జంప్ అవుతారా?

 

హరికృష్ణ రాజకీయ నిర్ణయాల వలన జూ.యన్టీఆర్ సినిమా కెరీర్ లో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నిజమయిన పక్షంలో ఇప్పుడు అతనికి తన మామగారు నార్నే శ్రీనివాసరావు వలన కూడా కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. నార్నేశ్రీనివాసరావు గుంటూరు లేదా నరసరావు పేట నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు సీట్లు ఇప్పటికే వల్లభనేని బాలశౌరి, అయోధ్య రామిరెడ్డికి ఇచ్చేందుకు జగన్ మాట ఇచ్చినందున, శ్రీనివాసరావుకి ఎటువంటి హామీ ఈయనప్పటికీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఎందుకంటే, ఆయనను పార్టీలోకి రప్పించగలిగితే, జూ.యన్టీఆర్ కూడా ఆయన పక్షం వహించక తప్పదు.  అంతే గాక ఆయనకు చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యన్.స్టూడియో కూడా వైకాపా పక్షం వహిస్తుంది గనుక, అది ఎన్నికల ముందు పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఆయనకి వేరే ఎక్కడయినా టికెట్ ఇచ్చి పార్టీలోకి రప్పించవచ్చు.

 

అదే జరిగితే, మొట్ట మొదటగా ఆ ప్రభావం జూ.యన్టీఆర్ మీదే పడటం ఖాయం. ఇదివరకు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ తో ఆడిన మైండ్ గేమ్స్ వలన తమకూ, పార్టీకి, కుటుంబానికి మధ్య అగాధం ఇప్పటికీ పూడ్చుకోలేక జూ.యన్టీఆర్, అతని తండ్రి హరికృష్ణ నేటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు నార్నే శ్రీనివాసరావు కనుక వైకాపాలో చేరినట్లయితే జూ.యన్టీఆర్ మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు.

 

అతను తన మామగార్ని అనుసరించి వైకాపా వైపు వెళ్ళలేడు. వెళితే అది అనేక కొత్త సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా అది అతని సినిమా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నార్నెవారు వైకాపాలో జేరినట్లయితే, జూ.యన్టీఆర్- తెదేపాల మధ్య ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నసంబంధాలు పూర్తిగా చెడే ప్రమాదం ఉంది. గనుక నార్నెవారు వైకాపా తీర్ధం పుచ్చుకొనే ముందు ఇటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మేలేమో! అంతకంటే ఆయన తెదేపా నుండి టికెట్ సంపాదించుకొన్నట్లయితే అది ఉభాయకుశులోపరిగా ఉంటుంది కదా!