రాహుల్ మీద మోడీ వ్యంగ్యాస్త్రాలు!
posted on Oct 25, 2013 @ 6:38PM
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడిన తీరు విమర్శల్ని ఎదుర్కొంటోంది. కరుణ రసాత్మకంగా మాట్లాడిన రాహుల్ టాపిక్‌ని తానూ హత్యకి గురవుతానేమోననే పాయింట్ వరకూ తీసుకెళ్ళాడు. రాహుల్ ప్రసంగం ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా సాగింది.
రాహుల్‌గాంధీ ప్రసంగం కొత్త ఓట్లు తెచ్చే మాట దేవుడెరుగు ఉన్న ఓట్లని కూడా పోగొట్టేలా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ తీరు పట్ల కాంగ్రెస్ వర్గాల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. రాహుల్ మాట తీరును భారతీయ జనతాపార్టీ గురువారమే అధికారికంగా ఖండించింది. ముస్లింలు కూడా రాహుల్ మాట్లాడిన తీరు ముస్లింలను అవమానించే విధంగా ఉందని విమర్శిస్తున్నారు.
సిక్కుల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా రాహుల్ గాంధీకి పరోక్షంగా చురకలు వేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ రాహుల్ మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాను వచ్చింది కన్నీళ్ళు తుడవడానికే తప్ప కన్నీరు కార్చడానికి కాదని చురక అంటించాడు. మొత్తమ్మీద ఈ ఇష్యూలో రాహుల్‌గాంధీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది.