అన్నదమ్ముల్లా ఉన్న మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు: లోకేష్
posted on Jun 9, 2020 @ 12:36PM
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీడీపీ నేత నారా లోకేష్ విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడిగా తాను పనికిరానా అంటూ లోకేష్ కన్నీరు పెట్టుకున్నారని, పార్టీ అధ్యక్షుని ఎంపికలో మనస్పర్థలు తలెత్తడంతో లోకేష్ తన తండ్రి చంద్రబాబుపై చెయ్యి చేసుకున్నారని.. ఇలా రకరకాలుగా మీడియాలో న్యూస్ వచ్చినట్టుగా ఎడిట్ చేసి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి అభిమానుల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. లోకేష్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇవి కొందరు నిజమని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ గారికి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్ కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టిడిపి అధ్యక్షుడు ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారు." అంటూ ఎద్దేవా చేశారు.
"అన్నదమ్ముల్లా ఉన్న నాకు,ఎంపీ రామ్మోహన్ నాయుడికి మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటిఎం బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి. మీ ప్రయత్నాలు టిడిపి నాయకుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. టిడిపిలో ప్రతి కార్యకర్తా అధ్యక్షుడితో సమానమే అని విషయం వైకాపా పేటిఎమ్ బ్యాచ్ కి గుర్తుచేస్తున్నాను." అని లోకేష్ పేర్కొన్నారు.