కుయ్ కుయ్ అన్నారు.. అవి కుయ్యో మొర్రో అంటున్నాయి
posted on Jul 14, 2020 @ 4:22PM
ఇటీవల 108 వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి సరైన సమయానికి రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వాహనాలు మొరాయిస్తున్నాయి అంటూ రోడ్డుపై ఆగిపోయిన 108 వాహనాల ఫోటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ 108 వాహనాల వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
"కుయ్,కుయ్,కుయ్ అన్నారు. కానీ అవి కుయ్యో,మొర్రో అంటున్నాయి.కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వైఎస్ జగన్ గారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి." అని లోకేష్ విమర్శించారు.
"అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థత కి గురై నడి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108 కి కాల్ చేసినా అంబులెన్స్ రాక ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జగన్ రెడ్డి గారికి ప్రచార ఆర్బాటం పై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణం." అంటూ లోకేష్ మండిపడ్డారు.