తెలుగు జాతి కోసమే తెలుగు దేశం
posted on Mar 29, 2021 @ 5:40PM
తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వేడుకలు జరిపారు. పార్టీ జెండాలను ఎగురవేసి స్వర్గీయ నందమూరి తారకరామారావును స్మరించుకున్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు.
రైతు సంక్షేమం కోసం ఎన్టీఆర్ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు చెప్పారు. పేదల పక్కా ఇళ్లకు 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. 9 నెలల్లో ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదేనని తెలిపారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు టీడీపీనే అధికారంలో ఉందన్నారు. రాజకీయాలంటే సేవాభావం, పేదల సంక్షేమం అని ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కరోనా తర్వాత ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయన్నారు టీడీపీ అధినేత.
హైదరాబాద్‌లో తాము శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలోనే కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే వైఎస్, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారని తెలిపారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలని సూచించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు చంద్రబాబు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ టీడీపీ అన్నారు. గత రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని చంద్రబాబు మండిపడ్డారు.