నానా పటేకర్ రాజకీయ తూటాలు.. వైరల్ చేస్తున్న జనాలు! సమాధానం చెప్పదెవరు?
posted on Aug 18, 2021 @ 8:02PM
నానా పటేకర్ ఒక విలక్షణ నటుడు. సామాజిక స్పృహ కలిగిన మంచి రచయిత, కథకుడు, నిర్మాత, దర్శకుడు ... ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యమ కార్యకర్త. ఆయన తమ మనసులో మెదిలిన కొన్ని ఆలోచనలు, సంఘర్షణలకు అక్షర రూపం ఇచ్చారు ... కొనీ నిర్దిష్ట ప్రశ్నలను లేవనెత్తారు.. నిజానికి ఇవేవి కొత్తగా పుట్టుకొచ్చిన ప్రశ్నలు కాదు. మన అందరిలో రగులుతున్న అగ్నికణాలే .. గొంతెత్తి నిలతీయాలని ... అనుకుంటూ .. అసక్తతతో గొండులోనే ఆగిపోతున్న చేదు గుళికలనే .. నానా పటేకర్ ..అక్షర తూటాలు చేసి సంధించారు ...
అవును .. మందరికీ కాకపోయినా కొందరికి అయినా, ఎప్పుడో అప్పుడు, ఇదేమిటి ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతు .. అదే పొలంలో అలా చనిపోవడం ఏమిటి, ఆ రైతు కొడుకు ఎక్కడో, దేశ సరిహద్దుల్లో, ఏ ముష్కరడో పేల్చిన తూటాకు నేల కొరగడం ఏమిటి? ఏమీ కానీ వాడు, ఏమీ చేయని వాడు ... రాజకీయ వేషం కట్టిన వాడు ఇక్కడ దేశంలో ... వాడి కడుపున పుట్టడం తప్ప ఇంకే అర్హత, యోగ్యతా లేని, వాడి సంతానం అక్కడ విదేశాలలో అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ... విలాసవంత మైన జీవితాలను గడపడం ఏమిటి? అన్న ప్రశ్నలు వెంటాడే ఉంటాయి కదా.. అదిగో అలాంటి ప్రశ్నలే .. నానా పటేకర్... మన ముందుంచారు ..చూడండి ..
రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,
కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.
ఇదేమిటి ... ఇదెక్కడి న్యాయం ? అని పటేకర్ తనను తాను ప్రశ్నించుకుంటున్నారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని అని సమాజాన్ని నిలదీస్తున్నారు.
అలాగే రాజకీయ నాయకుల విద్యార్హతలను ప్రశ్నిస్తూ .. ఓక్ చేదు నిజాన్ని పటేకర్ నినదించారు ..
ఆచేదు నిజం ఏమంటే,
ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి.
అలాగే తమలో నిండిన అక్రోశాన్ని వ్యక్తపరుస్తూ ...ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు నేల కొరుగుతారో .. ఏ రోజు నేతల పంటలకు అగ్గి తగులుతుందో... ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి, అంటారు. అదే విధంగా పటేకర్ ... ఒక్క సారి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఎందు కివ్వాలి? ప్రశ్నిస్తున్నారు..
25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు.కానీ,ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.ఇలా ఎందుకు ఇవ్వాలి?
అలాగే పటేకర్ సంధించిన మరి కొన్ని తూటాలు ..
నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.కానీ,భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?
రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.కాని,మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.రైతు తినేది దొంగ సొమ్మా? నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం.
విద్యలో రాజకీయం 100% రాజకీయంలో విద్య 00% ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది.దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు.
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.నిజం, కానీ, నిజంగా చూస్తామా .. ఎప్పటికైనా అలాంటి రోజు ఒకటి వస్తుందా, అనుమానమేలేదు .. రాదు.
₹399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?
ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?
అందరూ ఆలోచించాలి. అంతటూ నానా పటేకర్ .. తమ మనసు విప్పి మనముందు ఉంచారు.