గోళ్లు చెప్పే ఆరోగ్యం!

 

పెద్దగా పట్టించుకోం అన్నమాటే కానీ ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ పని చేయాలన్నా మనకి గోళ్లే సాయపడతాయి. గోళ్లు కేవలం మన వేళ్లకి రక్షణ, బలం మాత్రమే కాదు... అవి మన ఆరోగ్యానికి సూచనలు కూడా! గోరు ఊడిపోతే కానీ కంగారుపడని మనం, ఒకోసారి గోటి రంగుని చూసి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటారా...

 

పాలిపోయి ఉంటే.. తెల్లగా తళతళలాడిపోయే గోళ్లు నిజానికి ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. కాబట్టి గోళ్లు మరీ పాలిపోయినట్లు ఉండి, దానికి తోడు తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుని చూడండి.

 

పసుపు: గోళ్లు పసుపుపచ్చగా ఉంటే చూసేవాళ్లకి కూడా వెగటు పుట్టిస్తాయి. సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. మీ అలవాట్లను మానుకోమంటూ హెచ్చరిస్తుంటాయి. గోరు మొత్తం చాలాకాలం పాటు పసుపురంగులోకి మారిపోయి ఉంటే అది డయాబెటిస్, ధైరాయిడ్ వంటి వ్యాధులకు సూచన కావచ్చు.

 

పగుళ్లతో కనిపిస్తుంటే: చాలామంది పెద్దవాళ్లలో గోళ్లు పొడిబారిపోయి... పొరలుపొరలుగా విడిపోతూ... తేలికగా విరిగిపోతూ ఉంటాయి. వయసు మీరకుండానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్త అవసరం. తరచూ నీటిలో నానడం, ఘాటైన రసాయనాలలో చేతులు పెట్టేయడం, నెయిల్ పాలిష్‌ రిమూవర్‌ను వాడటం దీనికి కారణం కావచ్చు. అటు నీళ్లు, ఇటు బట్టల సబ్బులతో ఎక్కువసేపు గడిపే ఆడవారిలో ఇలాంటి గోళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకోసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు కూడా గోళ్లు ఇలా మనల్ని హెచ్చరిస్తుంటాయి.

 

గీతలు: చాలామంది పెద్దవారి గోళ్ల మీద నిలువు గీతలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవేమంత కంగారుపడాల్సిన సూచనలు కావు. మహా అయితే ‘బి’ విటమిన్‌ లోపించడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ అడ్డగీతలు కనిపిస్తే మాత్రం వైద్యుని సంప్రదించడం మంచిది. శరీరం ఏదన్నా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు, గోళ్లలో ఇలాంటి అడ్డగీతలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గోళ్లు పెరుగుదల కూడా ఆగిపోయేంతగా శరీరంలో ఏదో లోపం ఏర్పడినట్లు లెక్క. షుగరు వ్యాధి అదుపు తప్పడం దగ్గర్నుంచీ... తీవ్రమైన జింకు లోపం వరకూ అడ్డగీతలు చాలా సమస్యలకు సూచన కావచ్చు.

 

మచ్చలు: గోళ్ల అడుగు భాగంలో తెల్లటి చుక్కలు కనిపించడం సర్వసాధారణమైన విషయం. గోళ్లు పెరిగేకొద్దీ, ఈ మచ్చలు కూడా కరిగిపోతూ ఉంటాయి. గోరుకి ఏదన్నా దెబ్బ తగిలినా, లేకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్‌ వచ్చినా కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు మరీ సుదీర్ఘకాలం ఉంటే తప్ప వీటి గురించి అంత భయపడాల్సిన పని లేదు. కానీ తెల్లగా కాకుండా గాఢమైన రంగులో ఏవన్నా మచ్చలు లేక గీతలు ఉండి నొప్పిగా ఉంటే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అవి ఒకోసారి స్కిన్‌ క్యాన్సర్‌కు సూచన కావచ్చు.

- నిర్జర.