సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్.. బీజేపీ టికెట్ ఎవరికో?
posted on Mar 29, 2021 @ 12:01PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టీఆర్‌ఎస్ టికెట్ ఖాయమైంది. సాగర్ టికెట్ విషయంలో సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. స్థానిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. వివిధ సర్వే సంస్థల ద్వారా వివరాలు తెప్పించుకోవడంతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. ఈనెల 30 మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. 28న రాత్రి 11గంటలకు భగత్‌కే టికెట్ కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఆయనకు తెలిపారు. భగత్‌ను ఆదివారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు పిలిపించగా, టికెట్ రేసులో ఉన్న ఎంసీ.కోటిరెడ్డిని సైతం హైదరాబాద్‌కు రప్పించారు. ఆదివారమే సీఎంతో కోటిరెడ్డి, మంత్రి జగదీ్‌షరెడ్డి భేటీ కావాల్సి ఉండగా, సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం అందరి సమక్షంలో భగత్ పేరును సీఎం ప్రకటించనున్నారు.
నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఢీకొట్టడం, నోముల కుటుంబానికి న్యాయం చేయడం వంటి అంశాలే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సర్వేలు చేయించారని చెబుతున్నారు. లోకల్ అంశం కొంత భగత్ కు వ్యతిరేకంగా ఉన్నా.. నర్సింహయ్యపై ప్రజల్లో ఉన్న సానుభూతి ఆయనకు కలిసి వస్తుందనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారంటున్నారు. సాగర్ టికెట్ రేసులో నిలిచిన గురువయ్య యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు కూల్ చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఏప్రిల్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో ప్రచారం నిమిత్తం నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. హాలియాలో 50వేల మందితో సభ ఉంటుందని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా కేటీఆర్ రోడ్‌షోలు ఉంటాయని తెలిసింది.
టీఆర్‌ఎస్ అభ్యర్థి ఖరారు కావడంతో బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ టికెట్ రేసులో 2018 ఎన్నికల్లో పోటీ చేసిన నివేదితా రెడ్డితో పాటు ఇంద్రాసేనా రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ ఉన్నారు. టీఆర్ఎస్ యాదవ్ కు ఇచ్చినందున బీజేపీ నుంచి రెడ్డి లేదా ఎస్టీ అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఆదివారం సాయంత్రం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో కీలక నేతలు మంత్రి శ్రీనివాస్, సంకినేని, గంగిడి మనోహర్, నూకల నరసింహారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో ప్రచార సభలు అందులో పాల్గొనే వక్తలు, నామినేషన్, సోషల్ మీడియా ఇలా 27కీలక అంశాలను గుర్తించి వాటికి ఇన్‌చార్జులను ఖరారు చేశారు. మేనేజ్‌మెంట్ కమిటీ మొత్తానికి చైర్మన్‌గా సంకినేని వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండగా, వైస్ చైర్మన్లుగా సురే్‌షరెడ్డి, గంగిడి మనోహర్‌ను నియమించారు. 30మందితో సాగర్ ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ పెద్దలు ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ తో ఢీ అంటే ఢీ అన్న రీతికి పార్టీ, ప్రచా రం ఉంటే తానూ సాగర్‌కు వస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమాచారం ఇచ్చారు.