టీఆర్ఎస్ లో సాగర్ కిరికిరి?
posted on Mar 24, 2021 @ 11:01AM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు మొదలయ్యాయి. అధికార పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని తేల్చడం లేదు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో అభ్యర్థి ఎంపికకై ఆచితూచి అడుగులు వేస్తోంది గులాబీ పార్టీ. తమ సిట్టింగ్ స్థానమైన సాగర్ లో ఏ మాత్రం తేడా వచ్చినా.. పార్టీ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అభ్యర్థి ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పార్టీలో జోష్ వచ్చినా.. నల్గొండ జిల్లా నేతల మధ్య వర్గపోరు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. జిల్లా నేతలు ఏకతాటిపై లేకపోవడం వల్లే నాగార్జున సాగర్ అభ్యర్థి ఎంపిక కొలిక్కి రావడం లేదని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ టికెట్ విషయంలో నల్గొండ టీఆర్ఎస్ లో మూడు ముక్కలాట జరుగుతుందని తెలుస్తోంది. సాగర్ టికెట్ కోసం సీనియర్లు ఫైట్ చేస్తున్నారని చెబుతున్నారు. యాదవ, రెడ్డి కులంలో టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో యాదవ కులం ఓట్లు ఎక్కువుండగా.. రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్ ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్‌తో పాటు గురువయ్య యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నోముల కొడుక్కే టికెట్ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పట్టుపడుతున్నారని చెబుతున్నారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రతిపాదిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. తన క్లాస్ మేట్ అయిన కోటిరెడ్డికి టికెట్ కోసం జగదీశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ .. తమ బంధువైన గురవయ్య యాదవ్ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో సాగర్ అభ్యర్థిని కేసీఆర్ ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. నల్గొండ జిల్లా నేతలతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని.. గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు జిల్లా నేతలను ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.
మరోవైపు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను సాగర్ లో మకాం వేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించగా.. వారంతా అభ్యర్థి లేకుండానే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌ను సాగర్ లో మోహరించేందుకు గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారట. మంత్రులకు టార్గెట్ పెట్టి ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోల్ మేనేజ్ మెంట్ విపక్షాలకు చుక్కలు చూపించింది. దీంతో నాగార్జున సాగర్ పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలన్నీ పల్లాకే అప్పగించారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.