బిజెపిలోకి నాగం జనార్థన్ రెడ్డి
posted on Apr 12, 2013 8:03AM
తెలంగాణా నగారా సమితి నేత, తెలుగుదేశంపార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్థన రెడ్డి బిజెపిలో చేరుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా నాగం జనార్థన రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలకు, పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సంఘటనతో నాగం బిజెపిలోకి చేరుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. నాగంను విలేఖరులు ఈ విషయమై ప్రశ్నించగా జవాబిస్తూ కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇవ్వదని తేలిపోయింది, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలంటే కేంద్రంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పడాలని, భారతీయ జనతాపార్టీ తెలంగాణా ఇస్తుందనే నమ్మకంతోనే తాను ఈరోజు బిజెపి కార్యాలయానికి వచ్చానని తెలిపారు. భారతీయ జనతాపార్టీలో ఎప్పుడు చేరుతున్నారని విలేఖరులు ప్రశ్నించగా కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. టి.ఆర్.ఎస్. పార్టీ ఒక్కదానితో తెలంగాణా రాష్ట్రం ఏర్పడదని, మిగతా పార్టీలను కూడా కలుపుకుంటేనే వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.