నాగబాబు, నారాయణ వివాదం టీ కప్పులో తుపాను
posted on Jul 20, 2022 @ 5:20PM
మెగా స్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఉవ్వెత్తున లేచిన వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోయింది. నటుడు చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ ఇటీవల విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవిల్లితో పోల్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరైన సంగతి విదితమే.
ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఊసరవిల్లిలా రంగులు మార్చే చిరంజీవిని కాకుండా అల్లూరి సీతారామరాజుపై సినిమా నిర్మించి, నటించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. దీంతో నారాయణపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత తీవ్రంగా స్పందించారు. సీపీఐ నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలమైందనని అంటూ ఆయన కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారంటూ విమర్శించారు.
మెగా అభిమానులంతా కలిసి ఆయన చేత గడ్డి తినడం మాన్పించి అన్నం తినడం అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తను చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీపీఐ నారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.
అదే సమయంలో తన వ్యాఖ్యలను కేవలం భాషా దోషంగా భావించి మన్నించాలని కోరారు. నారాయణ క్షమాపణులు కోరి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో మోగా బ్రదర్ పవన్ కల్యాణ్ శాంతించారు. క్షమాగుణం జనసైనికుల ధర్మం అని పేర్కొన్నారు.
అలాగే తప్పు ఎవరు చేసిన క్షమించమని కోరితే క్షమించాలని పేర్కొన్నారు. సీపీఐ నారాయణ వయస్సును దృష్టిలోఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికులకు పిలుపు నిచ్చారు.