మైసురా రెడ్డి టీడీపీలోకి జంప్..?
posted on Nov 28, 2016 @ 4:30PM
వైసీపీ నేత ఎంవీ మైసూరా రెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ వార్తలకు స్పందించిన మైసురా రెడ్డి తాను పార్టీ మారేది లేదు అంటూ ఆ వార్తలను ఖండించారు. అయితే ఆ తరువాత ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అందుకు కారణం.. ఎంవీ మైసూరారెడ్డి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ని కలవడమే. కడపజిల్లా ఎర్రగుంట్లలో మైసూరాను టీడీపీ నేత సీఎం రమేష్ ఈరోజు కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైసూరారెడ్డిని సీఎం రమేష్ కలిసినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు మైసూరాను కలిసిన సమయంలో సీఎం రమేష్ వెంట ఉండడం విశేషం. అంతేకాదు సీఎం రమేష్, మైసూరాతో కొంతసేపు ఏకాంతంగా మాట్లాడారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీలో చేరుతారా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మైసూరా ఎలా స్పందిస్తారో చూడాలి.