హిందూ ఆలయాల నిర్మాణానికి సాయం.. ముస్లిం కుటుంబం ఆదర్శం
posted on Sep 15, 2020 @ 10:37AM
కులాలు, మతాల పేరుతో మనుషులకి మనుషులకి మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. మా దృష్టిలో మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం అంటూ ఓ ముస్లిం జంట ఆదర్శంగా నిలుస్తోంది. అసోంలోని జోర్‌హాట్ జిల్లాకు చెందిన 39 ఏళ్ల హామిదుర్ రహమాన్, ఆయన భార్య పార్సియా సుల్తానాలు.. మసీదులతో పాటు కొన్ని హిందూ ఆలయాల నిర్మాణాలు, మరమ్మతులు చేయించారు. అంతేకాదు, వారికి సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయించారు.
హామిదుర్ తండ్రి టీ తోటలో పనిచేసేవారు. అక్కడ వారి కుటుంబం తప్ప, అందరూ హిందువులే ఉండేవారు. టీ తోటలో ఉన్న హరి మందిరంలో పౌరాణిక నాటకాలు వేసేవారు. హామిదుర్ కూడా తన మిత్రులతో కలిసి వాటిలో పాత్రలు వేసేవారు. ఆ విధంగా ఆయనకు అన్ని మతాలపై గౌరవం ఏర్పడింది.
"మా కాలనీలో ఉండేవాళ్లు, మిత్రులు నన్ను ఎప్పుడూ వేరే మతం వాడిగా చూడలేదు. తాను అన్ని మతాలను గౌరవించడానికి ఇదే కారణం. నా స్తోమత కొద్దీ వీలైన సాయం చేస్తుంటా. నా మనసుకు సంతోషం కలగాలని ఈ పని చేస్తున్నాను తప్ప ప్రచారం కోసం కాదు" అని హామిదుర్ మీడియాతో చెప్పారు.
హామిదుర్ రోజూ నమాజ్ చదువుతారు. హిందూ ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారు. వీలైన సాయం చేస్తుంటారు. స్థానికంగా మసీదు నిర్మాణం, సుందరీకరణకు హామిదుర్ దాదాపు రూ.12 లక్షలు దానం చేశారు. ఓ హిందూ మందిరానికి కాళీ మాత విగ్రహాన్ని, త్రిశూలాన్ని, గంటను దానం చేశారు. తితాబర్ పట్టణంలో ఓ శివాలయ నిర్మాణానికి కూడా సాయం చేశారు. తితాబర్ హైండిక్ గ్రామంలో ఉన్న మందిరంలో ఒక హాలును, బంగాలీ పట్టీలోని రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో టాయిలెట్లను కట్టించారు. రాధాకృష్ణ మందిర సమీపంలో రోడ్డును కూడా వేయించారు. హిందూ దేవాలయాల నిర్మాణానికి హామిదుర్ సాయం చేస్తుండటాన్ని స్థానిక ముస్లింలు కూడా అభినందిస్తున్నారు.
హామిదుర్ కు జోర్‌హాట్‌లోని చినామార్‌లో ఉక్కు పరిశ్రమ ఉంది. ఒకప్పుడు ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, గత కొన్నేళ్లలో వ్యాపారంలో బాగా ఎదిగారని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి తనకి తోచిన సాయం చేయడం మొదలుపెట్టారు. ఆయనకు కుటుంబం కూడా మద్దతిస్తోంది. "సాయం చేయడం కన్నా మంచి పని ఏముంటుంది. మా మొత్తం కుటుంబం ఆయన వెంట ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయి" అని హామిదుర్ భార్య సుల్తానా అంటున్నారు.
కొందరు స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాల పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెడుతుంటే.. హామిదుర్ మాత్రం 'మనుషులంతా సమానం, అన్ని మతాలను గౌరవిస్తాం' అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.