కేసీఆర్ కు మునుగోడు భయం?
posted on Aug 20, 2022 @ 5:48PM
కేసీఆర్ లో ఓటమి భయం మొదలైందా? మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి.. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? అనవసరపు ఎన్నిక పుట్టి ముంచుతుందా అన్న అనుమానం మొదలైందా? బీజేపీ వ్యూహాత్మకంగా తెచ్చి తలమీద పెట్టిన మునుగోడు ఉప ఎన్నిక తలభారంగా మారుతుందని ఆందోళన పడుతున్నారా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే అంటున్నారు.
మునుగోడులో ప్రజాదీవెన పేరిట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం (ఆగస్టు 20) జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే మునుగోడు కాంగ్రెస్ కు మరో హుజూరాబాద్ అవుతుందా అన్న అనుమానం కేసీఆర్ లో కలిగిందని అనిపించక మానదని పరిశీలకులుఅంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో ధీమా లోపించిందనీ, ధైర్యం సడలిందనీ వారు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభమే మునుగోడు ఎవరికీ అవసరం లేని ఎన్నిక అని ప్రారంభించడమే కాకుండా.. ఎంత అవసరం లేని ఎన్నికైనా ఇక్కడ టీఆర్ఎస్ గెలవకుంటే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయంటూ జనాలను హెచ్చరించారు. తన ధైర్యం మీరే అంటూ జనానికి చెబుతూనే అటువంటి మీరే మద్దతు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.
సాధారణంగా సభ ఏదైనా, వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా కేసీఆర్ నెటి వెంట మాటల బాణాలు ప్రత్యర్థులపై నిప్పుల వాన కురిపిస్తాయి. అలాంటిది ఈ సారి కేసీఆర్ కేంద్రంపై, మోడీపై, అమిత్ షాలపై కురిపించిన విమర్శల వర్షంలో వాడి వేడి కన్నా... స్వీయ రక్షణ భావమే కనిపించింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా తలొగ్గక మీటర్లు పెట్టేదేలే అని కోట్లాడాననీ, ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ గెలవకుంటే.. తనను పక్కకు నెట్టేసి మరీ వ్యవసాయ మోటార్లకు మోడీ మీటర్లు పెడతారనీ ప్రజలను ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడారు. మునుగోడులో గెలవకుంటే సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మునుగోడు వాస్తవానికి టీఆర్ఎస్ స్థానం కాదు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో వచ్చిన ఎన్నిక ఆ స్థానం నిలుపుకోవడం కాంగ్రెస్ కు ముఖ్యం. కావాలని ఉప ఎన్నిక వచ్చేలా పావులు కదిపిన బీజేపీకి అక్కడ విజయం ముఖ్యం. మునుగోడులో గెలిచినా, ఓడినా టీఆర్ఎస్ కు వచ్చేది కానీ పోయేది కానీ ఏమీ లేదు.
అయినా కేసీఆర్ మునుగోడు ఫలితం జీవన్మరణ సమస్యగా భావిస్తుండటానికి కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా భావిస్తుండటమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అందుకే మునుగోడు సభలో ఈ ఉప ఎన్నికను గోల్ మాల్ ఎన్నికగా అభివర్ణిస్తూనే.. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటేయకుంటే.. యావత్ తెలంగాణకు నష్టం అన్నారు. బీజేపీ మాటలకు మోసపోతే గోస తప్పదని హెచ్చరించారు. అడుగడుగునా తెలంగాణకు చేటు చేస్తున్న మోడీ, షాలపై విమర్శల వాగ్బాణాలు సంధించారు. కానీ అదే సమయంలో.. కమలం వైపు మొగ్గు చూపితే సంక్షేమం మాట మరచిపోవాల్సిందే అని హెచ్చరికలూ చేశారు. మునుగోడు ఓటు తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశిస్తుందని కేసీఆర్ అన్నారు.
ఇంకా తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లైనా ఇంకా కృష్ణా జలాల్లో మన వాటా ఎందుకు తేల్చలేదో.. మునుగోడుకు రానున్న అమిత్ షాను నిలదీసి తెలుసుకోవాలన్నారు. దేశం యావత్తూ మెచ్చుకునేలా సంక్షేమ బాటలో టీఆర్ఎస్ సర్కార్ ముందుకు సాగుతుంటే.. ఆ సంక్షేమాన్ని బంద్ పెట్టాలనుకుంటున్న బీజేపీకి మునుగోడులో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో దేశంలో ఏ వర్గానికీ మేలు జరగలేదన్న ఆయన బ్యాంకులు, రైళ్లు, రోడ్లు ఇలా అన్నిటినీ అమ్మేస్తూ పోతోందని, ముందు ముందు రైతులభూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోందని కేసీఆర్ అన్నారు. క్రియాశీల, ప్రగతి శీల శక్తుల కలయికకు మునుగోడు నాంది పలికిందన్నారు. సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ప్రకటించిన ఆయన ఈ బంధం దేశ వ్యాప్తంగా మోడీ దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు.
మొత్తం మీద మునుగోడు సభలో కేసీఆర్ కేంద్రంపై విమర్శలతో చెలరేగారు. ఇటీవల తరచుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన పై చేస్తున్న అవినీతి ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈడీ లేదు బోడీ లేదు.. తప్పు చేసిన వారు భయపడతారు తాను కాదని అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వ పతనం తప్పదంటూ బీజేపీ విమర్శలకూ బదులిచ్చారు. అసెంబ్లీలో ముగ్గురు సభ్యులున్న వారు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. అది అహంకారమా బలుపా అని ప్రశ్నించారు. ప్రజల కోసం ఆలోచించి, వారి కోసం నిజాయితీగా పని చేసేవారు మోడీకి భయపడరని కేసీఆర్ అన్నారు. మాట్లాడితే చాలు తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటుంటారు, ప్రజా మద్దతుతో గెలిచిన ఆ ప్రభుత్వాలను కూల్చేస్తానని విర్రవీగే నిన్ను పడగొట్టే వాళ్లే లేరనుకుంటున్నారా మోడీ అని ప్రశ్నించారు. మోడీని ఎవరూ పడగొట్టక్కర్లేదు ఆయన అహంకారమే ఆయనను కూల్చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇన్ని చెప్పిన కేసీఆర్ మళ్లీ మునుగోడు ఉప ఎన్నికకు వచ్చే సరికి ఓటర్లకు రెండే రెండు చాయిస్ లు ఇచ్చారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా… మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా.. తేల్చుకోవాలన్నారు. తాను తెలంగాణ కోసం తెగించిన నిలబడగలిగానంటే అందుకు ప్రజలిచ్చిన బలమే కారణమన్నారు. ఇప్పుడు ఆగం చేస్తే తెలంగాణ ఏమవుతుందని ప్రశ్నించారు. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకు రావాలంటే… ఈ దుర్మార్గులకు తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసమో, పార్టీ కోసమో కాదన్న కేసీఆర్ తెలంగాణ ఏమంటుుందనేది మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా దేశం మొత్తానికీ చాటాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద బొమ్మలు ( ఫ్లెక్సీలు) చూసి మోసపోతే గోస పడతామని హెచ్చరించారు.