మునుగోడు ముహూర్తం ఖరార్ .. ఉపఎన్నిక ఎప్పుడంటే ..!
posted on Sep 21, 2022 @ 10:27AM
మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖారరైందా? సెప్టెంబర్ 17 న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్’ లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా పరిస్థితిని సమీక్షించింది, అందుకేనా? అంటే, అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. నిజానికి, బీజేపీలో చేరేందుకు, మునుగోడు సిట్టింగ్ (కాంగ్రెస్) ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి ఆగష్టు 7 న, రాజీనామా చేశారు. ఆ తేదీ నుంచి ఆరు నెలలోపు మునుగోడు అసెంబ్లీ స్థానికి ఉప ఎన్నిక జరగవలసి ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు టైముంది. అయితే, అంతవరకు ఆగితే,పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందో అనే అనుమానంతో కావచ్చు, కమల దళం అక్టోబర్ లేదా నవంబర్’ నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
నిజానికి, సాధారణంగా కేంద్ర ఎన్నికల కమిషన్, దేశంలో ఎక్కడైనా ఒకటి రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అయిన పరిస్థితిలో, ఆరు నెలల గడవు ముగిసేలోగా జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకే, డిసెంబర్’లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మునుగోడు ఉపఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. అయితే, నియోజక వర్గంలో పరిస్థితి వేగంగ మారుతున్నా నేపధ్యంలో ఆలస్యం అమృతం విషం అని భావించారో ఏమో కానీ, మునుగోడు వ్యూహ రచనకు కేంద్ర బిందువుగా ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా, ముందుగానే ఉప ఎన్నిక నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారని, అదే విషయాన్ని బీజేపే రాష్ట్ర నాయకులతో చర్చించారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల, (అక్టోబర్) చివరి వారంలో మునుగోడుతో పాటుగా, ఇతర రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ , లోక్ సభ స్థానాల ఉపఎన్నికల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది.
నిజానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం పరిదిలోకి రాదు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయించదు. కేంద్ర ఎన్నికల సంఘం, నిర్ణయిస్తుంది. కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది అన్నట్లు, మోడీ షా పాలనలో, కేంద్ర దర్యాప్తు సంస్థలే సర్కార్ చేతిలో కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కుంటున్నపరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని అనుకోవడం, తీసుకోవాలని అసిచంచడం పేరాశే అవుతుంది.
అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడు ఈసీ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఎన్నిక నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి అయితే, నెక్స్ట్ 45 డేస్’ లో మునుగోడు ఉప ఎన్నిక కథ ముగింపుకు వస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.