నెలలోగా మునిసిపల్ ఎన్నికలు
posted on Feb 4, 2014 @ 10:34AM
నాలుగు వారాల్లోగా రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణజ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన అంశం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతోపాటు ఇంత తక్కువ వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనానికి నివేదించారు. ఎన్నికల నిర్వహణకు మరింత వ్యవధి కావాలని అభ్యర్థించారు. అయితే గతంలో ఎన్నోసార్లు గడువులు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని, అలాగే రాష్ట్ర విభజన అంశం తాజాగా తెరమీదకు వచ్చింది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.