మమ్మీ..!
posted on Oct 16, 2022 @ 7:31PM
ఇంటికి అందం ఆడపిల్లలు. మనసు ఎంత వ్యధకి గురయినా, ఇంటికి రాగానే కనపడితే అదో ప్రశాంతత. ఒంటరిగా ఉన్నపుడు తానున్నా నని బుజం మీద చేయి వేసి కబుర్లు చెప్పే కూతురు ఇంట్లో ఉంటే అదో ధైర్యం, అదో అద్భుతం. పూర్వం ఆడపిల్లలు బరువు అనే అనుకునేవారు. ఇపుడు ఆ అభిప్రాయాలకు తావులేదు. చిన్నపిల్లయినా కళ్లు తుడిచి హక్కున చేర్చు కుంటుంది. అంతకంటే జీవితంలో ఏం కావాలి. ఈ తల్లికీ అంతే.. ఊహించని పరమానందం పంచింది ఈ చిన్నారి.
కారణం ఏదన్నా కావచ్చు. ప్రశాంతత కరువయింది ఆ తల్లికి. తన సమస్యలు చెప్పుకుని బాధను తగ్గించుకోవడానికి ఆమెకు తల్లి లేదు. బుజ్జిదానితో కాలక్షేపంతో కాలం గడిపేస్తోంది. దానితోనే మాటలు, ఆటలు. కానీ ఆ బుజ్జితల్లి మాత్రం తన యింట్లో బామ్మో, మామ్మో లేకపోవడం గమనించింది. ఆమధ్య నీకు మమ్మీ లేదా? అని అడిగింది. ఆ తల్లి క్షణం ఆశ్చర్యపోయింది. లేదు అన గలిగింది. చిన్నపిల్లకి చెప్పినా అర్ధంకాదుగనక. దూరమయినవారి గురించి పిల్లలకు చెప్పకూడదనే ఉద్దేశం కావచ్చు! కానీ ఆ పసిది మాత్రం నేను నీ అమ్మని.. నన్ను మమ్మీ అని పిలు! అంది. ఇది ఊహించని సమాధానం. ఊహించని ప్రశాంతత.
అమాంతం పిల్లదాన్ని గట్టిగా కావలించుకుని మమ్మీ అంటూ భోరున ఏడ్చింది ఆ తల్లి.. ఏడవకు.. నేనున్నానని చిట్టిచేతులతో కొడుతూ ధైర్యం చెప్పింది. ఇపుడు ఆ తల్లికి ఓ తల్లి దొరికింది.. కొండంత ధైర్యమూ ఇచ్చింది! ఆమె ఆనందం ఆకాశమంత!