భారత్ కు ముంబై పేలుళ్ల సూత్రధారి రాణా!

కరుడుగట్టిన తీవ్రవాది తహవ్యూర్ రాణాను అమెరికా నుంచి రప్పించడంలో భారత్ విజయం సాధించింది. 2008 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన  తహవ్వూర్ రాణా గురువారం  (ఏప్రిల్ 10) తెల్లవారు జామున అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.  నిఘా, దర్యాప్తు సంస్థల అధికారుల ప్రత్యేక బృందం స్పెషల్ ఫ్లైట్ లో రాణాను అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకురానున్నది.  భారత్‌కు చేరుకున్న వెంటనే రాణాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ మొత్తం వ్యవహారమంతా  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. 

పాకిస్థాన్‌ సంతతికి చెందిన కెనడియన్   రాణా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా  లో  కీలక పాత్రధారి. ముంబైలోని కీలక లక్ష్యాలపై దాడులకు డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి రాణా సహకరించారు. అలాగే రాణా సహకారంతోనే   ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడ్డారు. 2008 ముంబై ఉగ్రదాడిలో 170 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాటి దాడిలో పాల్గొన్న కసబ్ ను సజీవంగా పట్టుకున్న భద్రతా దళాలు మిగిలిన ఉగ్రవాదులను   మట్టుబెట్టాయి.  అనంతరం కసబ్ ను కూడా విచారణ అనంతరం కోర్టు తీర్పునకు అనుగుణంగా ఉరి తీసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ దాడుల వెనుక సూత్రధారి అయిన రాణా అప్పటి నుంచీ అమెరికాలో తలదాచు కుంటున్నారు. అతడిని తమకు అప్పగించాల్సిందిగా భారత్ అమెరికాను కోరి అందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టింది.   రాణా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ ఫర్మ్ చేసినా,  భారత్‌కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ  రాణా   అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడు ఆ పిటిషన్ ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేయడంతో రాణా అమెరికా నుంచి భారత్ కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది.  

Teluguone gnews banner