కాపు ఉద్యమ నేత ముద్రగడ సంచలన నిర్ణయం
posted on Jul 13, 2020 @ 12:15PM
కాపులను బీసీలలో చేర్చాలని తీవ్రంగా ఉద్యమం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇటీవల కొందరు సోషల్ మీడియాలో తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాకుండా తనను కుల ద్రోహి, గజదొంగ వంటి దారుణమైన వ్యాఖ్యలతో విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో మేధావులతో కలిసి తాను ఉద్యమం నడిపానని ఆయన చెప్పారు. కాపు ఉద్యమం ద్వారా నిజానికి తాను ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని అయన తెలిపారు. కొంత మంది తనను రోజుకో మాట మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారని అయన తెలిపారు . ఇప్పుడు కాపు రిజర్వేషన్ బంతిని కేంద్రం కోర్టులో వేశాననడం తనను తీవ్రంగా బాధిస్తోందని అయన వాపోయారు. ఐతే ఉద్యమ సందర్భానుసారంగా రూపురేఖలు మార్చుకుంటోందని, దీనితో తన జాతికి ఏదో ఒక విధంగా మేలు జరగాలని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని అయన ఈ సందర్భంగా తెలిపారు.