జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ముద్రగడ పద్మనాభం
posted on Mar 15, 2024 @ 1:32PM
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం అనే లాంఛనం పూర్తి చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే భారీ ర్యాలీతో తాడేపల్లి చేరుకుని అట్టహాసంగా వైసీపీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆశించిన ముద్రగడ తరువాత ఏవో కుంటి సాకులు చెబుతూ, సీఎం భద్రత అంటూ అతి నిరాడంబరంగా పార్టీ చేరిక లాంఛనాన్ని మమ అనిపించేశారు.
కాగా ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా ఈ సందర్భంగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలలో మంత్రిగా కూడా పని చేశారు.