నిలకడగా ముద్రగడ ఆరోగ్యం.. తుని కేసులో నలుగురికి బెయిల్..
posted on Jun 18, 2016 @ 10:30AM
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన దీక్ష ఈరోజుతో పదో రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. రాత్రి వైద్యానికి సహకరించారని, సెలైన్లు ఎక్కించామని తెలిపారు. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగటంపై కుటుంబ సభ్యులకు వివరించామని వెద్యులు చెప్పారు.
ఇదిలా ఉండగా తుని అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారిలో నలుగురికి బెయిల్ లభించింది. మొత్తం 13 మందిని అరెస్ట్ చేయగా వారిలో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది పిఠాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు. కోర్టు అనుమతి లేకుండా నిందితులు ఎక్కడకూ వెళ్లవద్దని, స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.