ఏపీపై ఆర్టికల్ 360 ప్రయోగం?.. రంగంలోకి రాష్ట్రపతి?.. జగన్ సర్కారుకు ముప్పు?
posted on Aug 9, 2021 @ 1:09PM
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఏపీ దివాళా తీసింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సంక్షోభ పథకాల పేరుతో ఖజానా ఖాళీ చేసేశారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చింది లేదు. అభివృద్ధి జాడే కనిపించదు. ఉన్న కంపెనీలే పెట్టాబేడా సర్దేసుకుంటున్నాయి. రిలయన్స్ నుంచి అమరరాజా వరకూ ఇదే తీరు. ఇప్పటికే హద్దు దాటేశారు. హద్దు మీరి అప్పులు చేశారు. లెక్కలతో తమ్మిని బమ్మి చేస్తున్నారు. కాగ్, పీఏసీ కడిగేస్తున్నా సర్కారు దగ్గర సరైన సమాధానం లేదు. అటు కేంద్రం సైతం అప్పులపై వివరాలు అడుగుతోంది. ఏకంగా ఏజీని రంగంలోకి దింపడంతో జగన్ సర్కారు కంగుతింది. ఉన్న సమస్యలు సరిపోనట్టు.. ఎంపీ రఘురామ మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు పదే పదే ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఫిర్యాదులతో సర్కారును ఇరకాటంలో పడేస్తున్నారు. తాజాగా, రఘురామ కీలకమైన పాయింట్ తెర మీదకు తీసుకొచ్చారు. ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలంటూ ఏకంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఫిర్యాదు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొందని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఆర్టికల్ 360 ద్వారా ఏపీలో ఆర్థిక అత్యయిక స్థితి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఏపీ రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రాష్ట్ర ఆర్థిక లోటు డిసెంబర్ నాటికే రూ.68,536 కోట్లు దాటింది. ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా ప్రభుత్వానికి గగనమైపోతోంది. జులైలో రెండో వారం వరకూ కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రఘురామ కోరారు. ఈ పరిణామం, రఘురామ ఫిర్యాదు.. జగన్ సర్కారును కలవరానికి గురిచేస్తోంది.