మొన్న ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నేడు మంత్రి గన్ లైసెన్స్ అర్జీ !
posted on Jun 27, 2023 @ 3:07PM
ఏపీలో అసలు సామాన్య ప్రజలకు రక్షణ ఉందా అంటే లేదని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అందుకు వైసీపీ నేతల దారుణ పరిస్థితే ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. రాష్ట్రంలో దోపిడీలు, అమలు కానీ చట్టాలు, అఘాయిత్యాలు, అక్రమాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ప్రతిపక్షాల ఆరోపణలని ప్రభుత్వం కొట్టిపారేసినా సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు అందునా ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ లేకపోవడాన్ని ప్రభుత్వం సమర్ధించుకోలేకపోతుంది. ఈ మధ్యనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు, ఎంపీ ఎంవీవీ భార్య, కుమారుడు కిడ్నాప్ కు గురయ్యారు. జీవీ వృత్తిరీత్యా ఆడిటర్.. వైసీపీ నేతగా కూడా ఉన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ముందుగా ఎంపీ కుటుంబాన్ని అపహరించిన కిడ్నాపర్లు రూ.50కోట్లు డిమాండ్ చేస్తూ ఆడిటర్ జీవీకి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా కనిపించలేదు. రిషికొండలోని ఎంపీ ఇంట్లోకి దూరిన దుండగులు కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. ఉదయం 6-7 గంటల మధ్య ఈ ఘటన జరగగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ముందుగా దుండగులు సీతమ్మధారలో ఉన్న జీవీకి ఎంపీ భార్యతో ఫోన్ చేయించారు. ఆయన వచ్చాక ముగ్గురిని అపహరించారు.
అప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందన్న ఎంపీ ఇకపై విశాఖలో ఉండలేనని హైదరాబాద్ కు తన కుటుంబంతో సహా షిఫ్ట్ అవుతున్నట్లు కూడా చెప్పారు. విశాఖలో ప్రజలు సంతోషంగానే ఉన్నా తనకు ఇకపై విశాఖలో ఉండాలని లేదని చెప్పారు. ఈ సంఘటన రాజకీయాలలో కలకలం రేపితే రాష్ట్ర ప్రజలలో ఆందోళన మొదలైంది. ఒక ఎంపీ తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వారిని తేల్చాలని, ఏకంగా సిబిఐ దర్యాప్తు కోరడం అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ పై నమ్మకం లేనట్లే అవుతుంది. ఒక ఎంపీకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నదానిపై రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.
కాగా, ఇప్పుడు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ గన్ లైసెన్స్ కావాలని పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉండే గన్ మెన్లు, ఇంటి చుట్టూ మూడంచెల భద్రత ఉండే ఒక మంత్రి ఒక గన్ లైసెన్స్ కావాలని అర్జీ పెట్టుకున్నారంటే.. తనకి తన ఇంట్లో కూడా ఆత్మ రక్షణ భయం పట్టుకుందని భావించాలి. ఇదే ఇప్పుడు విశాఖలో అతి పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎంపీలు, మంత్రులు తమకి ఆత్మ రక్షణ కోసం, తన భద్రత కోసం గన్ లైసెన్సులు కోరితే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది కూడా అందరిలో మెదులుతున్న సందేహంగా ఉంది.
ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ ఉదంతం తరువాత గుడివాడ అమర్నాధ్ కూడా అలెర్ట్ అయినట్లుగా ఇది కనిపిస్తుంది. ఈ రెండు ఉదంతాలను చూస్తే విశాఖలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? వైసీపీ ప్రభుత్వం రాజధాని బూచి చూపించి విశాఖ నగరాన్ని ఏ విధంగా దోచుకుంటుందో.. వైసీపీ ప్రభుత్వం అక్కడ ప్రజల ప్రశాంతతను ఎంతగా నాశనం చేసారో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రుషికొండ లాంటి వాటిని పిండి చేసేసిన జగన్ ప్రభుత్వం, రాజధాని పేరుతో నగరంలో భారీ ఎత్తున అక్రమ రియల్టర్లను పెంచి పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో అరాచకాలు పెరిగిపోయి ఇప్పుడు సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకే వణుకు మొదలయ్యే స్థాయికి చేరింది. మరి ఇక ఇది ఇంకెంత దారుణ పరిస్థితులకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.