కీర్తి ఆజాద్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు
posted on Dec 23, 2015 @ 7:20PM
ఊహించినట్లే బీజేపీ తన ఎంపి కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కుంభకోణంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పోటీగా కీర్తి ఆజాద్ కూడా అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారు. దాని వలన పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయి. పార్టీ అధిష్టానం ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా జైట్లీపై విమర్శలు గుప్పిస్తుండటంతో కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ బుధవారం సాయంత్రం ప్రకటించింది.
ఈ విషయం తెలియగానే కీర్తి ఆజాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి “నేను అవినీతికి వ్యతిరేకంగానే పోరాడాను తప్ప వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. డీడీసీఏలో అవినీతి జరిగిన మాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. దాని గురించి మాట్లాడినందుకే నాపై ఇటువంటి చర్య తీసుకోవడం దురదృష్టకరం. డీడీసీఏలో గుండు సూది మొదలుకొని పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ప్రతీ కొనుగోలులో, పనిలో అవినీతి జరిగింది. ఈ అవినీతి చివరికి ‘వికీ లీక్స్’ వరకు చేరుకొంది అంటే ఎంత బారీ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. వికీ లీక్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలలో ఆ అవినీతి బాగోతాలు చూడవచ్చును,” అని కీర్తి ఆజాద్ అన్నారు. ఆ వివరాలున్న వీడియోని ఆయన మీడియా ప్రతినిధులకు ప్రదర్శించి చూపారు. పార్టీలో ఉన్నా లేకపోయినా అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు.