నివాళులు అర్పించడంలో కూడా రాజకీయం
posted on Apr 15, 2013 @ 12:31PM
ఆదివారం 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన టిడిపి నేత మోత్కుపల్లి నరశింహ, ఎర్రబెల్లి దయాకర్ లకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన తరువాత మోత్కుపల్లి నరసింహ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తే తమను కోదండరాం అవమానించారని, తెలంగాణా జెఎసి చైర్మన్ కోదండరాం ఉద్యమం పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారని, ప్రొఫెసర్ గా ఉండి ఒక్క విద్యార్థికీ పాఠం చెప్పని కోదండరాం ఉద్యమం చాటున కొన్ని పార్టీలను బలోపేతం చేసేందుకే పనిచేస్తున్నారని, దళితులను ఉద్యమానికి దూరం చేస్తున్న కోదండరాం కు వ్యతిరేకంగా ఎస్సీలంతా ఏకం కావాలని, గతంలో దళితమంత్రిని కూడా కించపరిచేలా కోదండరాం మాట్లాడిన విషయం గమనించాలని, అంబేద్కర్ విగ్రహానికి దండ వేసే అర్హత కోదండరాం కు లేదని, అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించే సందర్భంగా రాజకీయాలకు పాల్పడిన ఘనత కోదండరాంకే దక్కుతుందని మోత్కుపల్లి కోదండరాంపై విరుచుకుపడ్డారు.