అయిన వారికే అందలాలు.. తెలంగాణలో రైటైర్డ్ బ్యూరోక్రాట్లకే పెద్ద పీట
posted on Feb 17, 2023 @ 11:46AM
తెలంగాణలో బ్యూరోక్రాట్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకే ఆయన పెద్ద పీట వేస్తుండటంతో అధికారుల్లో అసంతృప్తి అండర్ కరెంట్ గా రగులుతోంది.
సర్వీసులు ఉన్న అధికారులను పక్కన పెట్టి మరీ పదవీ విరమణ చేసిన వారినే ఆయన అందలం ఎక్కిస్తున్నారన్న భావన చాలా మంది అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇష్టం ఉన్న అధికారులు పదవీ విరమణ కాగానే వారికి సలహాదారు పదవో, లేదా పదవీ విరమణ చేయడానికి ముందు వారు నిర్వహించిన వాఖలో బాధ్యతలను అప్పగించడంతో సర్వీసులో ఉన్న అధికారుల్లో అసంతృప్తి గూడుకట్టుకుంటుంది.
ముఖ్యమంత్రి వ్యవహారాలను చూసే ముఖ్య కార్యదర్శి సైతం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిన తరువాత కేసీఆర్ ఈ కొత్త ట్రెండ్ ను తీసుకు వచ్చారని అంటున్నారు. ఆర్థిక, ప్రజాపంపిణీ, సాధారణ పరిపాలన, పశుసంవర్ధక శాఖల్లో పదవీ విరమణ చేసిన వారే అదే హోదాలో కొనసాగుతున్నారు.
అయితే రాష్ట్ర విభజన నాటికి 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం ఆ తరువాత 32 జిల్లాల రాష్ట్రంగా మారడంతో ఐఏఎస్ ల కొరత కారణంగానే రిటైర్డ్ అధికారులను కొనసాగించాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తున్నా... రాష్ట్రంలో పని చేస్తున్న చాలా మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టడంపై విమర్శలు వినవస్తున్నాయి.