కరోనాపై మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం
posted on Dec 22, 2022 @ 1:05PM
చైనా, జపాన్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వ్యాప్తిపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.
మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, నిపుణుల సూచనలను.. మోదీకి ఈ సమావేశంలో వివరించారు. కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటుంటే.. బీఎఫ్ 7 వేరియంట్ రూపంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏపీలోని కోనసీమ జిల్లా ఒమిక్రాన్ కేసును గుర్తించినట్లు అధికారులు తెలిపారు.