మోడీ రంజాన్ తోఫా.. చంద్రబాబును తు.చ. తప్పకుండా అనుకరించిన ప్రధాని
posted on Mar 26, 2025 @ 2:35PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భవిష్యత్ ను దర్శించడంలో దిట్ట. ఆయన ఏం చేసినా తరతరాలు నిలబడిపోయేలా ఉంటుంది. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే. ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తారు. ముందు విమర్శలు చేసిన వారు కూడా తరువాత ప్రశంసలు గుప్పించేలా ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కార్యాచరణ ఉంటుంది. అందుకే ఆయనపై ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా, ఆరోపణలు చేసినా జనం వాటిని విశ్వసించరు.
గతంలో చంద్రబాబు ఆరంభించి, ప్రారంభించిన పలు పథకాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అవ్వడమే చంద్రబాము ముందు చూపుకూ, వాస్తవిక దృక్ఫథానికీ నిదర్శనంగా పరిశీలకులు చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గతంలో ప్రారంభించి అమలు చేసిన ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు. అంతే కాదు.. ఆ పథకానికి అప్పట్లో చంద్రబాబు పెట్టిన పేరునే కంటిన్యూ చేస్తూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ పథకం ఏమిటనుకుంటున్నారా.. రంజాన్ తోఫా. ఔను రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ ను పురస్కరించుకుని వారి ఇళ్లల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు దోహదం చేసేలా రంజాన్ తోఫా అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ముస్లింలకు అవసరమైన పండుగ సరుకులను అందజేశారు. అంతేనా హిందువులకు సంక్రాంతి కానుక, క్రైస్తవులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ఈ పథకాలకు బ్రహ్మాండమైన ప్రజాదరణ లభించింది.
ఇప్పుడు మోడీ కూడా ముచ్చటగా మూడో సారి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న 32 లక్షల పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన రంజాన్ తోఫాను యాజ్ ఇట్ ఈజ్ గా అదే పేరుతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.