మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా
posted on Jan 11, 2023 @ 12:08PM
తెలంగాణ బీజేపీ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లైంది. రాష్ట్రంలో దూకుడు పెంచిన బీజేపీ ఈ నెలలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందంటూ భారాస నాయకులు చేస్తున్న ప్రచారాన్ని, విమర్శలకు తిప్పి కొట్టే విధంగా మోడీ తన పర్యటనలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటం, ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడంతో భారాస విమర్శలను తిప్పికొట్టేందుకు మంచి అవకాశంలభిస్తుందన్న ఉత్సాహంతో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకులు మోడీ పర్యటన వాయిదాపడటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
బిజీ షెడ్యూల్ కారణంగా మోడ పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు భూమి పూజ, వందే భారత్ రైలు ప్రారంభోత్సవం, అలాగే 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ, ఇంకా రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు భూమిపూజ కార్యక్రమాలు కూడా మోడీ పర్యటనతో పాటే వాయిదా పడ్డాయి.
అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోడీ నోటి వెంట కేంద్రం తెలంగాణకు అందించిన సహాయం, చేసిన మేళ్లు వివరించే అవకాశం ఆయన పర్యటన వాయిదాతో చేజారిందన్న అభిప్రాయం బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది.