కవిత కాలికి గాయం.. ఈడీ విచారణకు బ్రేక్?
posted on Apr 12, 2023 @ 9:39AM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కవిత ట్వీట్ చేశారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఫ్రాక్చర్ ఎప్పడు, ఎక్కడ, ఎలా జరిగిందనే విషయం ఆమె చెప్పలేదు.
అదలా ఉంటే కవిత కాలుకు గాయం అయిందన్న వార్త విన్నబీఆర్ఎస్ క్యాడర్, భారత జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు, సహజంగానే సానుకూలంగా స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ ఇష్ట దైవాలాను ప్రార్ధించారు. ప్రార్ధనలు చేస్తున్నారు. కవితక్క జాగ్రత్త ... అంటూ సోషల్ మీడియా సందేశాలు పంపిస్తున్నారు.
మరోవంక దాల్ మే కుచ్ కాలా ..హై ..అని అనుమానిస్తున్న వారు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికీ మూడు సార్లు ఈడీ ఎదుట విచారణకు హాజరైన కవితను మరోమారు విచారించవచ్చనే సమాచారం అందుతున్న నేపథ్యంలో కవిత కాలి గాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో రకరకాలు కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ వెల్లడించిన తాజా వివరాల నేపథ్యంలో ఈడీ ఏ క్షణంలో అయినా కవితకు ఫ్రెష్ సమన్లు జారీ చేయవచ్చని అంటున్నారు.