ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు భూతద్దంలో భవిష్యత్ చిత్రం!
posted on Mar 17, 2023 @ 3:31PM
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఫలితం ముఖ్యమంత్రి జగన్ కు భవిష్యత్ చిత్రాన్ని భూతద్దంలో చూపించేసిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంత కాలం ఒక్క ఉత్తరాంధ్రలోనే వైసీపీకి అదీ మంత్రులకు ఎదురుగాలి వీస్తోందన్న అభిప్రాయం ఉండేది. కానీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే.. ఒక్క ఉత్తరాంధ్ర అనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వైసీపీ ఎదురీదుతోందని పక్కాగా అర్థమైపోయిందని చెబుతున్నారు.
రాయలసీమ, కోస్తా, పల్నాడు ప్రాంతాలు ఏవైనా అధికార వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడికక్కడ జగన్ పార్టీకి ఎదురీతే గతి అని తేటతెల్లమైపోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరి గుండెల్లోనూ ఓటమి భయాన్ని పరుగులు తీయిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175’ అని ఒక వైపు డాంబికంగా చెబుతుంటే.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి కళ్లకు కడుతోంది. సర్కార్ వారి ఐప్యాక్ సహా ఒకటికి మూడు సర్వేలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉందన్న నివేదికలు ఇచ్చేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ నివేదికలు అక్షర సత్యాలన్న సంగతిని నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేసేశాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఫలితాల సరళిని బట్టి అవగతమౌతోంది. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో హడావుడి చేసినా.. చివరికి కానుకలు పందేరం చేసినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్తరాంధ్ర లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి హవాను నిలువరించలేకపోయారు. రౌండు రౌండుకూ ఆయన ఆధిక్యత పెరుగుతూ వస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆయన దరిదాపులకు కూడా రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రలోభాల పర్వానికి తెరతీసిన వైసీపీ.. పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. విశాఖే రాజధాని, అక్కడి నుంచే పాలన అంటూ ఊరూవాడా ఏకం చేసింది. అయితే అక్కడి ప్రజలు మాత్రం స్పష్టతతో ఉన్నారు.
అక్కడ తెలుగుదేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి అధికార వైసీపీకి కచ్చితంగా ఇబ్బందికరమే. అదే విధంగా తూర్పు రాలయసీమలోనూ వైసీపీకి శృంగభంగం తప్పని పరిస్థితే కనిపిస్తోంది. అక్కడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి పరాజయం దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ విజయం కోసం దొంగనోట్లపై ఆధారపడి.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసినా వైసీపీకి గడ్డు పరిస్థితే ఎదురు కావడం రాష్ట్రంలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా ప్రజలలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం గట్టిపోటీ ఇస్తోంది. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైసీపీ గెలుపు సునాయాసమన్న అంచనాలు తొలి నుంచీ ఉన్నాయి. వైసీపీకి పెట్టని కోటలాంటి ఈ ప్రాంతంలో కూడా పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో జరుగుతుండటం చూస్తే వైసీపీ కోటలు బీటలు వారిపోతున్న దృశ్యమే ఆవిష్కృతమౌతోంది.
ఈ ఎన్నికలతో సంబంధం లేకుండానే జగన్ ఇప్పటికే చేయించుకున్న సర్వేలు రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని స్పష్టం చేసేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే.. వైసీపీకి మళ్లీ అధికారం అన్న మాటే లేదని తేటతెల్లం చేసేశాయని పరిశీలకులు అంటున్నారు. మంత్రుల విజయావకాశాలపై ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ పాష, నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా మినహా మిగిలిన ఎవరికీ విజయావకాశాలు లేవని తేలింది. వాస్తవానికి విజయావకాశాలు ఉన్నాయని సర్వే లో పేర్కొన్న మంత్రులు కూడా కచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నదే ఆ సర్వే సారాంశం. అయితే మిగిలిన మంత్రుల కంటే వీరి పరిస్థితి ఓ రవ్వ మెరుగ్గా ఉందని సర్వే పేర్కొంది. అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ఫలితాలను బట్టి చూస్తే.. వీరి పరిస్థితీ దయనీయంగానే ఉందని తేటతెల్లమైపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అదలా ఉంచితే.. ఉత్తరాంధ్ర మంత్రులలో ఒకరు కూడా గెలిచే అవకాశమే లేదని ఐప్యాక్ సర్వే ఇప్పటికే పేర్కొనగా, తాజాగా ఉత్తరాంధ్రపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం.. ఆ సర్వే నే బలపరిచింది. పరాజయం ఖరారు అని సర్వే పేర్కొన్న మంత్రులలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు వంటివారు కూడా ఉన్నారు. ఇక సిదిరి అప్పలరాజు భూ కబ్జాలు, అక్రమాలపై ప్రజాగ్రహం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో మరింత ప్రస్ఫుటమైంది. ఓటర్లు అవినీతిపై స్లిప్పుల రూపంలో ఓటుతో పాటు బ్యాలెట్ బాక్కులో వేశారు. సిదిరి అప్పలరాజు అవినీతి పరుడు ఆయన మాకు వద్దు అంటూ ఆ స్లిప్లుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా అధికారులు దీనిని రహస్యంగా ఉంచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.