ఎమ్మెల్యే అంటే పెద్దోళ్లకి పైసలిచ్చేటోడు..!
posted on Sep 13, 2022 @ 1:00PM
మొన్నామధ్య ఏడో తరగతి పిల్లాడు సోషల్ పరీక్షరాయడానికి క్లాసులోకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు టీచర్. అందులో ఒక ప్రశ్న చూసి ఆ విద్యార్ధి తెగ కంగారు పడ్డాడు. సోషల్ అనగానే మరీ ఇంత తాజా రాజకీయాల సంబంధిత ప్రశ్న అడుగుతారని ఊహించలేదు. ఇంతకీ ఆ ప్రశ్నేమిటంటే ఎమ్మెల్యే అంటే ఎవరు? అని! దానికి ఆ విద్యార్ధి మనం ఎవ్వరం ఊహించని సమాధా నం రాశాడు. ఎన్ని కల సమయంలో వచ్చి పెద్దోళ్లకి బిర్యానీ, డబ్బులిచ్చేవాడని!!
ఏడో తరగతి విద్యార్ధి ఏమాత్రం తడుముకోకుండా తనకు తెలిసింది రాసేసాడు. ఏమాత్రం తప్పు రాయ లేదని ఎంతో ధైర్యంగా పేపరు ముగించి టీచర్‌కి ఇచ్చేసి వెళ్లాడు. ఇంతకీ ఆ పిల్లవాడు రాసినది ఇన్‌విజి లేటర్ చూసి ఆశ్చర్యపోయింది. ఎవ్వడూ ఇంత చిన్నవయసువాళ్లు ఇలాంటి సమాధానం చెప్పడం, రాయడం ఆమె కనీ వినీ ఎరుగదు. ఆశ్చర్యం కాదు.. కడుపుబ్బ నవ్వుకుంది ఆ టీచర్!
ఎన్నికల సమయంలో ఇంటికి వచ్చి పెద్దోళ్లకి డబ్బులు, మహిళలకు చీరలు ఇచ్చేవాడే ఎమ్మెల్యే అని గట్టి నమ్మకంతో ఆ పిల్లవాడు రాశాడు. వాస్తవంగా చూసినది, తెలిసినదే రాశాడు. ఆ సమాధానం నవ్వుకోవ డానికి బాగానే ఉందనుకోవద్దు. ఎందుకంటే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అలా ఉందిగనుక. నిజమే, గ్రామా ల్లో అభివృద్ధి కార్యక్రమాల మాట ఎలా ఉన్నా, ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో మాత్రం తప్ప కుండా ప్రతీ ఇల్లూ తిరిగే ఎమ్మెల్యేలు చాలాకాలం నుంచే ఇంటి పెద్దకు డబ్బులు, మహిళలకు చీరలు పంచి తమకు ఓటు వేసి గెలిపించాలని వేడుకోవడం పరిపాటిగా మారింది. ఇంతకంటే దారుణం మరోటి ఉండదని అనుకోవచ్చు. పెద్దవాళ్లు సరే, ఇలాంటి సంఘటనలు, సంద ర్భాలు పిల్లలు.. రాబేయే తరం మీద ఎంత ప్రభావం చూపుతుందన్న ఆలోచన ఈ తరానికీ లేకపోవడమే దురదృష్టకరం.
ఇంతకీ ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం లింగారెడ్డి గూడ స్కూల్లో జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ పేపరు దిద్దిన మాష్టారు ఆ సమాధానానికి 4 మార్కలు వేయడం!