జగన్ ఆస్తి 6 లక్షల కోట్లు.. చిట్టా విప్పుతా..
posted on Mar 1, 2016 @ 12:21PM
కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సి.ఆదినారాయణ ఇటీవలే టీడీపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఎన్నో నెలల నుండి పార్టీని వీడి టీడీపీలోకి చేరదామనుకున్న ఈయనకు రామసుబ్బారెడ్డి అడ్డుకోవడంతో లేట్ అయింది. ఎట్టకేలకు చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ రెడ్డి టీడీపీ లోకి రావడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన వైసీపీ అధినేత అయిన జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. జగన్ కు సంబంధించి అక్రమాస్తుల గురించి చిట్టా విప్పుతా అని అంటున్నారు.
ఆదినారాయణ నియోజక వర్గం జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమాస్తులు విలువ రూ.6 లక్షల కోట్లని.. జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, రూపాయి వడ్డీ వేసినా నేడు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల చిట్టాను ఆయన ఇలాకా పులివెందులలోని అంగళ్ళ ముందే విప్పుతానని వ్యాఖ్యానించారు. జగన్ కుళ్లు రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకే తాను చంద్రబాబు చెంతకు చేరినట్టు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు తనకు టీడీపీలో ఎవరితో బేధాలు లేవని.. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు.