ఎగ్జిట్ పోల్స్ లో గందరగోళం! దుబ్బాకపై భారీగా బెట్టింగులు
posted on Nov 4, 2020 @ 10:07AM
తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా.. ఆ సెగ మాత్రం తగ్గడం లేదు. ఉప ఎన్నికలో పోలింగ్ భారీగా జరగడంతో దుబ్బాక ఓటర్ల మెగ్గు ఎవరి వైపు అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పోలింగ్ సరళని బట్టి పార్టీలు తమకు వచ్చే ఓట్లను అంచనా వేసుకుంటూ ఫలితం ఎలా ఉండబోతుందో లెక్క గడుతున్నాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంపై ఆ రెండు పార్టీల నేతలు ధీమాగానే ఉన్నారు.
రాజకీయ పార్టీలు సవాల్ గా తీసుకుని పోరాడిన దుబ్బాక ఫలితంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు, జనాల్లో ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు మరింత టెన్షన్ రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా భిన్నంగా రావడంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు. పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో 47 శాతం ఓట్లతో బీజేపీ లీడ్ లోఉండగా, టీఆర్ఎస్ కు 30 శాతం, కాంగ్రెస్ కు 13 శాతం ఓట్లు వస్తున్నాయి. థర్డ్ విజన్ సర్వేలో టీఆర్ఎస్ కు ఆధిక్యం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే సీపీఎస్ సర్వేలో అధికార పార్టీ 47. 4శాతం ఓట్లు, బీజేపీకి 36. 3 శాతం ఓట్లు వస్తుండగా కాంగ్రెస్ కు 14.7 శాతం ఓట్లు వస్తున్నాయి. నాగన్న సర్వేలో గులాబీ పార్టీ ఏకంగా 51.5 శాతం ఓట్లతో గుబాళీస్తోంది.
దుబ్బాక బరిలో ఉన్న ప్రధాన పార్టీలు కూడా పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నాయి. బీజేపీ నేతల అంతర్గత లెక్కల ప్రకారం రఘునందన్ రావు ఏడు వేల నుంచి 12 వేల ఓట్లతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారట. దుబ్బాక, మిరుదొడ్డి, నర్సింగ్, రాయపోల్ లో తమకు లీడ్ వస్తుందని.. దౌలతాబాద్, చేగుంట, తోగుంటలో కారు ముందంజలో ఉందని కమలం నేతలు అంచనా వేస్తున్నారట. దుబ్బాక మున్సిపాలిటీలో తమకు ఓటింగ్ బాగా జరిగిందనే అంచనాలో ఉన్న రఘునందన్ రావు.. విజయంపై ఫుల్ క్లారిటీగా ఉన్నారని చెబుతున్నారు. యువత ఓట్లు వన్ సైడ్ గా తమకే పడ్డాయని, రైతులు కూడా కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు మళ్లారని అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా తమకే మద్దతుగా నిలిచారని, కాంగ్రెస్ కు గండి పడే ఓట్ల ఆధారంగా తమకు మెజార్టీ పెరుగుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
దుబ్బాకలో గెలుపు ఖాయమని గులాబీ నేతలు చెబుతున్నా.. లోలోపల మాత్రం వారిలో కొంత కంగారు కనిపిస్తోందని తెలుస్తోంది. అయితే మంత్రి హరీష్ రావు మాత్రం 25 వేల నుంచి 30 వేల ఓట్లతో సుజాత గెలవబోతుందని టీఆర్ఎస్ నేతల అంతర్గత సమావేశంలో చెప్పారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోనూ కారుకు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆయన పక్కాగా చెబుతున్నారట. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేసిన అసత్య ప్రచారం తమకు కొంత నష్టం కలిగించిందని హరీష్ రావు పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ముందు రోజు రాత్రి సిద్దిపేట హోటల్ లో జరిగిన ఘటనలు, రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో జరిగిన సోదాలపై బీజేపీ చేసిన ప్రచారం ప్రజల్లో కొంత ప్రభావం చూపిందని గులాబీ నేతలు భావిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ.. పోలింగ్ రోజుల సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తమకు నష్టం కలిగించిందని పోలింగ్ తర్వాత హరీష్ రావే స్వయంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నష్టం ఏ స్థాయిలో ఉంటుందోనని కొందరు అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం.
దుబ్బాకపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు మాత్రం పోలింగ్ తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారం తమ కొంప ముంచిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చెరుకుపై జరిగిన ప్రచారంతో కేసీఆర్ పై కసిగా కాంగ్రెస్ ఓటర్లు కూడా చివరి నిమిషంలో బీజేపీ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. అయినా తమకు గతంలో కంటే ఓట్లు పెరుగుతాయని, తోగుంట, చేగుంట, దుబ్బాక మండలాల్లో లీడ్ సాధిస్తామని హస్తం నేతలు అంచనా వేసుకుంటున్నారట. టీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయని, ఓటర్లను భారీగా ప్రలోభాలకు గురి చేశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికపై మొదటి నుంచి భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిశాకా అవి తీవ్రస్థాయికి చేరాయి. పార్టీల అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం పందెంరాయుళ్లు బెట్టింగులు వేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా భిన్నంగా రావడంతో బెట్టింగురాయుళ్లు కూడా గందరగోళానికి గురవుతున్నారని తెలుస్తోంది. అయినా తమ తెలిసిన సోర్సుల ద్వారా క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం తెప్పించుకుంటూ భారీగా బెట్టింగులు పెడుతున్నారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు మరో ఆరు రోజులు ఉండటంతో బెట్టింగులు గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో జరిగినా అశ్చర్యం లేదంటున్నారు.