‘నువ్వెంత అంటే నువ్వెంత’ .. రావెల వర్సెస్ ఎంపీపీ
posted on Nov 19, 2015 @ 3:06PM
టీడీపీ మంత్రి రావెల కిశోర్ బాబుకు తన సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడులో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావెలపై ఎంపీపీ తోట లక్ష్మీ కుమారి విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి రావెల గుంటూరు జెడ్పీ సమావేశంలో పాల్గొనగా.. ఈ సమావేశంలో పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే వారు గ్రామాల సమస్యల్ని తెలుపుతున్న నేపథ్యంలో తోట లక్ష్మీ కుమారి కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి రావెల కలుగజేసుకొని ‘నువ్వు మాట్లాడటానికి చాలా టైమ్ ఉంది.కూర్చోవమ్మా అని అడ్డుపడ్డారు. దీంతో లక్ష్మీ కుమారికి, రావెలకి మధ్య వాగ్వాదం నెలకొంది. సుమారు అరగంట సేపు వీరిద్దరూ వాదులాడుకోవడం..‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో మాటల యుద్ధం జరగడం.. ఇద్దరి అనుచరుల మధ్య తోపులాట కూడా జరగింది. దీంతో ఆగ్రహం చెందిన రావెల అక్కడినుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రావెల తీరుపై అక్కడి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రిగా ఆయన ఇలా ప్రవర్తించడం తగదని.. ప్రజాప్రతినిధులను గౌరవించాలని మండిపడుతున్నారు. ఆఖరికి ఈ గొడవ కాస్త చంద్రబాబు దృష్టికి వెళ్లడం జరిగింది. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.