టీకా వచ్చే వరకు జాగ్రత్తలు పాఠించాల్సిందే!
posted on Apr 28, 2020 @ 12:44PM
దేశాన్ని కాపాడటంలో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యులు కావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మెదక్ టౌన్ లోని ఓ ఫంక్షన్ హాలులో నాయినీ బ్రాహ్మణులకు, పాస్టర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సరుకుల్ని పంపిణీ చేశారు.
కరోనా విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బులు వేస్తోంది. బ్యాంకులో ప్రభుత్వం వేసిన డబ్బులు ఎక్కడికీ పోవు. డబ్బులు తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయని దుష్ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు. డబ్బులు అవసరం ఉన్న వారు మాత్రమే బ్యాంకుల వద్దకు వెళ్లండి. అందరూ వెళ్లి గందరగోళం సృష్టించవద్దని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు.
నాయినీ బ్రాహ్మణులకు షాపులు తెరవకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. కరోనా లాక్ డౌన్ నుండి రిలాక్సేషన్ కొంత ఇవ్వడానికి సీఎం గారు ఆలోచిస్తున్నారు. ఇప్పటికిప్పుడే కరోనా పోదని...నిపుణులు చెబుతున్నారు. సీఎం గారు అంతా ఆలోచన చేస్తున్నారు.
నాయినీ బ్రాహ్మణులు లాక్ డౌన్ ముగిసాక తమ షాపులు తెరిచినా... తప్పకుండా మాస్క్ లు ధరించాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పనిసరిగా పాఠించాలని హరీష్‌రావు సూచించారు.
వేడి ఆహరం, వేడి నీళ్లు తాగండి, ఫ్రిజ్ లో పెట్టి తినకండి. చల్లటి వస్తువులు తినవద్దు. పసుపును వేడి నీళ్లలో వేసి ఆవిరిపట్టండి.
శానిటైజర్స్ ను వాడండి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోండి. ప్రొటీన్ ఆహార పదార్థాలు, తాజా పండు తినండి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనాకు టీకా వచ్చే వరకు మనం జాగ్రత్తలు పాఠించాలని మంత్రి సూచించారు.