కాళ్లు కడిగి మరీ క్షమాపణ చెప్పిన మధ్య ప్రదేశ్ మంత్రి
posted on Jan 17, 2023 @ 11:24AM
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చూపడంలో విఫలమైతే క్షమాపణలు చెప్పుకునే సంస్కృతి ఇప్పుడు కాగడా వేసినా కనిపించదు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడం, అదేమని అడిగితే ఆగ్రహించడం.. ఆందోళనకు దిగితే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం ప్రస్తుతం ప్రభుత్వాలకు సర్వ సాధారణ విషయంగా మారిపోయింది.
ప్రజా వాణి వినిపించకుండా అణచివేయడమే పోలీసుల విధి అన్నట్లుగా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం కద్దు. ఏపీ విషయాన్నే తీసుకోండి.. ఏపీ సర్కార్ మద్య నిషేధం నుంచి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల వరకూ అన్నీ కల్పిస్తామనీ, ప్రతి జిల్లాకూ ఓ హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మిస్తామనీ గత ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో మాట్లాడటం లేదు. పైపెచ్చు ఇదేమిటని ప్రశ్నిస్తున్న విపక్షాల నాయకులపై కేసులు నమోదు చేస్తోంది. సభలూ సమావేశాలూ నిర్వహించకోవడానికి వీల్లేదంటూ నిషేధాస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇక ముఖ్యమంత్రి అయితే తన పర్యటన వేల జనం ఎవరూ ఎదురుపడి ప్రశ్నించడానికి వీల్లేకుండా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు కొనసాగిస్తున్నారు.
అయితే మధ్య ప్రదేశ్ లో ఒక మంత్రి రోడ్ల దుస్థితికి తన నిర్లక్ష్యమే కారణమని అంగీకరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతే కాదు ఆ అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ఆపి ఆ వ్యక్తి కాళ్లను స్వయంగా కడిగారు. ఈ ఘటన గ్వాలియర్ లో జరిగింది. పైపులైన్ల కోసం రోడ్డును తవ్వి అలాగే వదిలేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు.
ఆ రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కాళ్లు కడిగి మరీ తక్షణమే మంచినీటి పైపుల కోసం తవ్వి వదిలేసిన రోడ్లను మరమ్మతు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుపడే వరకూ తాను చెప్పులు ధరించనని శపథం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో ఆయన చెప్పులు ధరించడానికి అంగీకరించారు.మధ్య ప్రదేశ్ కే చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు.