వాడికి కొవ్వెక్కింది.. కొవ్వు తీసే టైం వచ్చింది.. టీడీపీ నేతలపై రెచ్చిపోయిన మరో మంత్రి
posted on Oct 5, 2020 @ 11:29AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నాయకులు నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహిస్తూ టీడీపీ నేతల పై రెచ్చిపోయారు. టీడీపీ నేత కూన రవికుమార్ కు కొవ్వెక్కిందని ఆయన అన్నారు. వాడెవడో బుద్దా వెంకన్న ఏదో వాగుతున్నాడని అన్నారు. వీరంతా బరి తెగించి మాట్లాడుతున్నారని.. కొవ్వు తీసే సమయం ఆసన్నమైందని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమరావతి రైతులపై అయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానంలో ఢిల్లీ వెళ్లినవారు అమరావతి రైతులు కాదని.. వారు ముమ్మాటికీ పెయిడ్ అర్టిస్టులేనని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
విశాఖ రాజధాని కోసం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ టీడీపీ నేతలు తనపై పోటీ చేసి గెలువగలరా అని ఆయన ప్రశ్నించారు. "పలాస నియోజక వర్గం నుంచి నేను రాజీనామా చేస్తా.. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడో, ఎంపీ రామ్మోహన్ నాయుడో లేక నారా లోకేష్ ఎవరైనా నాపై పోటీ చేసి గెలవాలని’’ మంత్రి సవాల్ విసిరారు. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కృష్ణదాస్ తన నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన విషయాలను ఎల్లో మీడియా వక్రీకరించి బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించిందని ఆయన విమర్శించారు.
ఎవరైతే బాగా బూతులు మాట్లాడగలరో, వీధి రౌడీల్లాగ వ్యవహరించగలరో వారినే చంద్రబాబు గుర్తించి మరీ పార్టీలో అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారంటే ఆ పార్టీ తీరు అందరికీ అర్థమవుతోందని మంత్రి అప్పలరాజు అన్నారు. కరోనా కాలంలో ఎక్కడా కనిపించని ఎంపీ రామ్మోహన్ నాయుడు పోలీస్ స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేయడానికి రావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసు స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం రౌడీయిజానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.