ఎంఐఎం తలాఖ్ వెనక అసలు కథ

 

 

 

 

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వ్యవహారంలో కిరణ్ సర్కారుపై అలిగిన ఎంఐఎం కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి తలాఖ్ చెప్పేసింది. మతతత్వ శక్తులకు దూరంగా ఉండాలన్న తలంపుతోనే తాము దశాబ్దంనుంచి కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పడంలేదని చెప్పుకొచ్చింది.

 

పైకి అసదుద్దీన్ ఇలాగే చెబుతున్నా.. లోపల మాత్రం అసలు విషయం వైఎస్ఆర్ సిపితో మ్యాచ్ ఫిక్సింగేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.. ఉపఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్ని ఆకట్టుకోవడంలో ఓ మేరకు విజయం సాధించిందనే చెప్పొచ్చు. అలాంటప్పుడు ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటే లాభపడొచ్చన్నది ఎంఐఎం వ్యూహమని సీనియర్ల అంచనా..

 

చిరంజీవి రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎంఐఎం నేతలెవరూ హాజరుకాకపోవడం, ఆ పార్టీ అగ్రనేతలు చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ తో ములాఖత్ అవ్వడం ఇలాంటి ఆలోచనలకు, అంచనాలకు ఊతమిచ్చే ఘటనలు. జగన్ కి అసదుద్దీన్ కి మధ్య రాజకీయబంధం ఏర్పడిందని, త్వరలోనే అది కాంగ్రెస్ కి మద్దతుపై ప్రభావం చూపించబోతోందనీ అప్పట్లోనే చాలామంది అనుకున్నారు.

 

రాబోయే రోజుల్లో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది అన్న దాని మీదే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో నిజానిజాలు తేలే అవకాశం ఉందన్నది అసలు నిజం. ఒకవేళ అంతా అనుకున్నట్టుగా అసదుద్దీన్ జగన్ పార్టీకి మద్దతిస్తే రాబోయే ఎన్నికలకోసం ఇప్పట్నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టే లెక్కని రాజకీయ వర్గాల అంచనా.