టీఎస్ అసెంబ్లీలో తీర్మాణం.. ఎంఐఎం దూరం.. అందుకేనా!
posted on Sep 8, 2020 @ 4:37PM
తెలంగాణ అసెంబ్లీలో అరుదైన ఘటన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ఎంఐఎం మద్దతు ఇవ్వలేదు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం.. అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ పెట్టిన ఓ తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం ఇదే ఫస్ట్ టైమ్. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పీవీ తెలంగాణ ఠీవి అని కొనియాడారు. దేశ ప్రతిష్టను పీవీ ఇనుమడింపజేశారని... పలు సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని చెప్పారు. మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లు భారతరత్నకు పీవీ అన్ని విధాలా అర్హుడని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అయితే పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి ఎంఐఎం దూరంగా ఉంది. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో బాబ్రీ మసీద్ ను కూల్చి వేశారు. ఈఘటన వెనక పీవీ పాత్ర ఉందని ముస్లిం సంఘాల నుంచి ఆరోపణలున్నాయి. కరసేవకులను అయోధ్య రాకుండా కట్టడి చేయడంలో పీవీ సర్కార్ నిర్లక్ష్యంగా వహించందని గతంలో ఎంఐఎం కూడా ఆరోపించింది. ఈ కారణంగానే పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి ఎంఐఎం మద్దతు ఇవ్వలేదని అనుకుంటున్నారు. అటు పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ కార్యక్రమాల్లోనూ ఎంఐఎం నేతలెవరు పాల్గొనడం లేదు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించడాన్ని మాత్రమే ఇప్పటివరకు ఎంఐఎం వ్యతిరేకించలేదు. అయితే తీర్మానానికి దూరంగా ఉంటూ ఆయనపై తమకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఎంఐఎం.
దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా నిలిచారు పీవీ నరసింహరావు. అయన హయాంలోనే దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వాటి వల్లే దేశంలో ఆర్థికంగా బలపడిందని చెబుతారు. కారణాలేవైనా పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ ఆయన సొంత రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.